'ఇసుక సత్యాగ్రహం' తప్పదు..!:సీపీఐ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Nov 2019 5:34 AM GMT
ఇసుక సత్యాగ్రహం తప్పదు..!:సీపీఐ

ముఖ్యాంశాలు

  • సీఎం జగన్‌కు సీపీఐ రామకృష్ణ లేఖ
  • ఇప్పటికైనా స్పందించి ఉచిత ఇసుక సరఫరా చేయాలి
  • ఉప్పు సత్యగ్రహంలాగా ఇసుక సత్యగ్రహం తప్పదన్న సీపీఐ

అమరావతి: 'ఇసుక సత్యాగ్రహం' తప్పదంటూ సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. గత ఐదు నెలలుగా ఇసుక సమస్య ఉంది. రాష్ట్రంలో వర్షాలు, నదులలో నీరు వల్ల ఇసుక కొరత ఉందని మంత్రులు చెప్పడం దారుణమన్నారు. పక్కన ఉన్న తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్రలో వర్షాలు, వరదలు సంభవించలేదా? అని కె.రామకృష్ణ ప్రశ్నించారు. మరి ఆయా రాష్ట్రాలకు లేని ఇసుక సమస్య ఏపీకి ఎందుకొచ్చిందన్నారు. మంత్రులు చెప్పేవన్నీ సాకులు మాత్రమేనని.. ఇసుక సమస్య వల్ల కార్మికులు ఉపాధి కోల్పోయారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. సిమెంట్‌, స్టీల్‌, ఇటుక, కంకర వ్యాపారులు దెబ్బతిన్నారు. ట్రాక్టర్లు, లారీలు, టిప్పర్ల వంటి వాహనాలకు నెలవారీ రుణ వాయిదాలు చెల్లించే పరిస్థితి లేదు. వీటన్నింటికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా ఇసుక సమస్యను పరిష్కరించి.. ఉచితంగా ఇసుకను సరఫరా చేయాలని కోరారు. కార్మికుల కుటుంబాలకు రూ.20 వేలు భృతి కింద చెల్లించాలన్నారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలను, ట్రేడ్‌ యూనియన్లను, ప్రజాసంఘాలను సమైక్యపరచి 'ఇసుక సత్యాగ్రహం' చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హెచ్చరించారు.

Cm Jagan Letter

ప్రజాసమస్యలపై నిరసనలు చేపడితే సంఘీభావం తెలుపుతాం: ఏపీ బీజేపీ చీఫ్‌ కన్నా

జగన్ ప్రభుత్వ తీరు వల్లే రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఆరోపించారు. ఇసుక సమస్యపై మొదట ఉద్యమం చేపట్టింది బీజేపీయేనని అన్నారు. ఇసుక కొరతపై రేపు విజయవాడలో ధర్నా కార్యక్రమం చేపడతామన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ అయినా మరొకరైనా.. ప్రజాసమస్యలపై నిరసనలు చేపడితే సంఘీభావం తెలుపుతామని పేర్కొన్నారు. ప్రభుత్వం భవన కార్మికులకు రూ. 10వేల భృతి ఇవ్వాలని కన్నా లక్ష్మినారాయణ డిమాండ్ చేశారు.

Next Story
Share it