ఆర్టీసీ సమ్మెతో నష్టపోతుందెవరు ? కార్మికులా? ప‌్రభుత్వమా? జనమా ?
By న్యూస్‌మీటర్ తెలుగు
తెలంగాణ ఆర్టీసీ సమ్మె 44వ రోజుకు చేరుకుంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే రెండు నెలలు కూడా దాటే పరిస్థితి కనిపిస్తోంది. కార్మికులు ఓ మెట్టు దిగారు. విలీనం డిమాండ్ పక్కన పెట్టారు, ప్రభుత్వం మాత్రం ఇంకా దిగి వచ్చే సూచనలు కనిపించడం లేదు. కోర్టులు కూడా పెద్ద జోక్యం చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. సమ్మెకు ఎండ్ కార్డ్ పడేది ఎలా? ఇప్పుడు అందరి ముందు ఉన్న ప్రశ్న.
కార్మికులు
యూనియన్ నాయకులు ఆదేశించారు. కార్మికులు సమ్మెకు దిగారు. నెల జీతం రాలేదు. ఇంకో నెల జీతం కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 50 వేల కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. వ్యవసాయం.. లేకపోతే అంతో ఇంతో ఆర్ధిక స్తోమత ఉన్న కుటుంబాలకు ఫర్వాలేదు. కానీ జీతంపై ఆధారపడే కుటుంబాల పరిస్థితి? ఏంటి అనేది ఎవరూ ఆలోచించడం లేదు. ఇప్పటికే 16కి పైగా గుండెలు ఆగిపోయాయి. ఇంకొన్ని ఆసుపత్రి ఐసీయూలో లబ్‌డబ్ అంటున్నాయి. రెండు నెలల జీతం రాకపోవడంతో కార్మికుల ఆర్థిక పరిస్థితి రెండేళ్ల వెనక్కి వెళ్లింది. ఈ రెండు నెలల్లో చేసిన అప్పులు తీర్చేందుకు మరో రెండేళ్లు పడుతోంది. సమ్మెకు చేసినందుకు వారికి న్యాయం జరుగుతుందా? అంటే అది ఆ దేవుడికే తెలియాలి.
యూనియన్ నాయకులు
యూనియన్ కోసం ఇచ్చే విరాళాలు, సంఘాల నేతలకు ఉండే రాజకీయ ప్రయోజనాలు ఆలోచించినంత గట్టిగా కార్మికుల కోసం ఆలోచించారో లేదో తెలియదు. సమ్మెకు దిగారు. కానీ దాన్ని ఎలా క్లోజ్ చేయాలో తెలియడం లేదు. ప్రతిపక్ష పార్టీల నుంచి మద్దతు పూర్తిగా రావడం లేదు. ఏదో మొక్కుబడి తంతు జరుగుతోంది. దీంతో విలీనం డిమాండ్‌ను పక్కనపెట్టారు. సమ్మెతో వీరికి నష్టం లేదు. ప్రగతి రథం చక్రం ప్రారంభమైన వెంటనే విలీనం ప్రగతి భవన్ బాట పడతారు. తమ పనులు చేసుకుంటారు.
ఆర్టీసీ ఉన్నతాధికారులు
ఆర్టీసీలో అందరికీ కనీసం 50వేల జీతమొస్తుంది. జీతభత్యాలన్నీ కలుపుకొని ఒక్కొక్కరికీ రెండున్నర నుంచి నాలుగు లక్షల దాకా అందుతున్నాయి. రీజనల్, జోనల్ మేనేజర్లు, డైరెక్టర్లు రోజుకు 50 వేలు సంపాదించేవాళ్లు కూడా ఉన్నారు. వీళ్లకు నష్టం లేదు, కానీ ఆర్టీసీ నష్టాలకు వీరే సగం కారణం. కానీ వీరిని పట్టించుకునే నాథుడే లేడు.
ఆర్టీసీ సంస్థ
ప్రజా రవాణా సంస్థ. ఇంకా ఏపీ, తెలంగాణ విభజన సంస్థ విభజన జరగలేదు. రెండు నెలల సమ్మెతో మళ్లీ బండి రెండేళ్ల వెనక్కి వెళ్లింది. ఈ సమ్మె పేరుతో చెప్పి సంస్థ అప్పుల అకౌంట్ పెంచేస్తారు. ఇప్పటికే పిచ్చి కుక్క ముద్ర వేసి ప్రైవేటు పరం చేసే కుట్ర నడుస్తోంది. ఇక వెర్రి కుక్కను చేసి ఎక్కడి ఆస్తులు అక్కడ విక్రయించే ప్రయత్నం చేస్తారు. మొత్తానికి ఎర్రబస్ పోయి పల్లె వెలుగు పచ్చ రంగు బస్ వచ్చింది. రేపోమాపో గులాబీ బస్ డిపోల నుంచి బయటకు వస్తుందో చూడాలి.
మంత్రులు
సమ్మెపై ఇంతవరకూ ఒక మంత్రి మాట్లాడలేదు. కనీసం జోక్యం చేసుకోలేదు. కార్మిక సంఘాలకు నాయకత్వం వహించిన వారు ఉన్నారు. అధికారుల కమిటీ వేశారు. కానీ మంత్రుల కమిటీ ఎందుకు వేయలేదో ముఖ్యమంత్రికి తెలియాలి. రాజకీయ జోక్యం లేనిదే ఇలాంటి సమస్యలు పరిష్కారం కావు.
ప్రతిపక్షాలు
ప‌్రభుత్వాన్ని బద్నాం చేయాలి. తమ పబ్బం గడుపుకోవాలి. తొలి 20 నుంచి 25 రోజులు ప్రతిపక్షాలు చూశాయి. ఆ తర్వాత కాడెను కార్మికులపై వదిలేశాయి. ఇప్పుడు ఆర్టీసీ డిపోల దగ్గర బస్ భవన్ దగ్గర ఏ నేత కనిపిచడం లేదు. తమ పార్టీల అంతర్గత గొడవల్లో మునిగిపోయారు. తమ సీటు కాపాడుకునే పనిలో పడ్డారు. కానీ ప్రభుత్వం చేస్తున్న తప్పును ఎవరూ సరిగ్గా ఎత్తిచూపలేకపోయారు. ప్రతిపక్షాలు మరోసారి ఫెయిల్ అయ్యాయి.
మీడియా
అనుకూల మీడియా, కొనుగోలు మీడియాకు ఎలాగు సిగ్గులు మొగ్గలు అనే పరిమితులు ఉండవు. కార్మికుల డిమాండ్లు ఏంటి? వాటి సాధ్యాసాధ్యాలు ఏంటి? అనేది ఏ మీడియా విశ్లేషించలేదు. కోర్టు చెప్పే మాటలను హెడ్డింగ్ పెట్టడం తప్ప..ఏమీడియా తన పాత్రను మాత్రం నిర్వర్తించడం లేదు.
ప్రభుత్వం
ప్రజలను పరిపాలించే ప్రభుత్వానికి, ఆ ప్రజల్లో ఆర్టీసీ కార్మికులు, వాళ్ల కుటుంబాలు ఉంటాయని గుర్తులేకపోవవడం నిజంగా సిగ్గుచేటు. కార్మిక సంఘాల నేతలను బూచిగా చూపెట్టి, కార్మికుల పొట్టగొట్టడం ఏ రకంగా కరెక్టో ప్రభుత్వ పెద్దలు చెప్పాలి. కార్మికుల చావు కూడా పెద్దలను కదిలించలేకపోతుందా? రెండో సారి గెలిచిన తర్వాత ఆ గులాబీ గుండెలో కరుణ కరువైందా? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.
ఆర్టీసీ సమ్మె ఇప్పుడు ఓ కేసు స్టడీగా మారింది. సమాజంలో ఎవరి పాత్రను వారు సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నారు. అందుకే ఈ సమస్యకు సొల్యూషన్ దొరకడం లేదు. ఎవరో ఒకరు తమ పాత్రను సరిగ్గా నిర్వరిస్తే సమ్మె చిటికెల్ పరిష్కారం అవుతుంది. పాలకులా ఓ మెట్టు దిగితే మీ కొంపం ఏ మునిగిపోదు. ఒక్కసారి ఆలోచించండి.