శిఖరాలే శిరస్సు వంచాయి..!
By న్యూస్‌మీటర్ తెలుగు
ఎవరైనా ఉన్నత శిఖరాలు అధిరోహించారు అంటే గొప్ప పనులు చేశారు అని అర్థం. కానీ నేపాలీ పర్వతారోహకుడు నిర్మల్ పుర్జ విషయంలో శిఖరాలు అధిరోహించడం అంటే పర్వతారోహణే.. అందుకే 190 రోజుల్లో ప్రపంచంలోని ఎత్తైన 14 శిఖరాలు అతనిని నెత్తినెక్కించుకున్నాయి. నువ్వు ఉండాల్సిన వాడివంటూ సలాం చేశాయి.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 14 శిఖరాలను కేవలం 190 రోజుల్లోనే అధిరోహించి నేపాల్‌కు చెందిన ప్రముఖ పర్వతారోహకుడు నిర్మల్ పుర్జ సరికొత్త రికార్డు సృష్టించాడు. చైనాలోనే శిశపాంగ్మా శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించి రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు దక్షిణ కొరియా పర్వతారోహకుడి పేరున వుండేది. అయితే అతను ఏడు సంవత్సరాల పది నెలల ఆరు రోజుల్లో ఈ రికార్డు నెలకొల్పాడు. కానీ 36 ఏళ్ల వయసున్న పూర్జా ఏడు నెలలలోపే అవే పర్వతాలు ఎక్కి రికార్డు గత రికార్డును బద్దలు కొట్టారు. గత నెల 23న ప్రాజెక్ట్ ఇంపాజిబుల్ 14/7 పేరుతో 8 వేల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న 14 శిఖరాలను అధిరోహించాలని లక్ష్యానికి పూర్జా అంకురార్పణ చేశారు. మొదటగా అన్నపూర్ణ శిఖరాన్ని అధిరోహించి తరువాత దౌలగిరి, కాంచనగంగ, ఎవరెస్టు ఇలా వరుసగా అధిరోహిస్తూ చివరకు చైనాలోని శిశపాంగ్మా శిఖరంతో రికార్డు నెలకొల్పాడు.
పూర్జా గతంలో బ్రిటన్ రాయల్ నేవీలో సైనికులుగా పనిచేశారు. పేదరికంలో మగ్గుతున్న నేపాలి పిల్లల కోసం ఓ ఫండ్ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా పది లక్షల అమెరికన్ డాలర్లను సేకరించడమే ధ్యేయంగా నిర్మల్ పుర్జ తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు.