ఉగ్రరూపం దాల్చిన కరోనా.. ఒక్కరోజే లక్షా80వేల కేసులు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Jun 2020 12:39 PM ISTకరోనా మహమ్మారి రోజురోజుకీ మరింత విజృంబిస్తుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఏకంగా లక్షా 83 వేల కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. అయితే ఇప్పటివరకూ ఒక్క రోజు వ్యవధిలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. బ్రెజిల్‌లో అత్యధికంగా 54,771 కేసులు నమోదుకాగా.. అమెరికాలో 36,617 కేసులు, భారత్‌లో 15,413 కేసులు నమోదయ్యాయి.
ఇదిలావుంటే.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 87,08,008 కేసులు నమోదయ్యాయి. ఇందులో 4,61,715 మంది మృతిచెందారు. ఇక గడిచిన 24గంటల్లో 4,743 మంది మరణించినట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అయితే.. కొత్తగా నమోదైన మరణాల్లో మూడో వంతు అమెరికా ఖండాల్లోని దేశాల నుంచే నమోదైనట్లు వెల్లడించింది.
ఇక బ్రెజిల్‌లో కరోనా వ్యాప్తి విస్తృతంగా ఉంది. మొట్టమొదటిసారి ఒక్క రోజు వ్యవధిలో 50 వేలకు పైగా కేసులు నమోదైనట్లు ఆ దేశ వైద్యారోగ్య శాఖ మంత్రి తెలిపారు. ఇక అక్కడ మృతుల సంఖ్య కూడా 50వేలు దాటింది. అగ్రరాజ్యం అమెరికా తర్వాత బ్రెజిల్‌లోనే మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నది.
ఇదిలావుంటే.. అమెరికాలో ఒక్క అరిజోనా రాష్ట్రంలోనే గడిచిన 24గంటల్లో 3,100 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అమెరికాలో 23,11,345 కేసులు నమోదయ్యాయి. ఈ నేఫథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పరీక్షలు చేస్తేనే కేసుల సంఖ్య పెరగుతోందని.. నిర్ధారణ పరీక్షల సంఖ్యను తగ్గించాలని అధికారులకు సూచించామన్నారు. ఇప్పుడా వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది.