పెరుగుతున్న కరోనా కేసులు..భారత్ లో 10కి చేరిన మృతుల సంఖ్య
By రాణి Published on 24 March 2020 1:01 PM ISTభారత్ లో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. సోమవారం సాయంత్రానికి 433 కరోనా కేసులు నమోదవ్వగా..మంగళవారం ఉదయానికి ఈ సంఖ్య 500కి చేరింది. మరో వ్యక్తి కరోనాతో మరణించడంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 10కి చేరింది. తెలంగాణలో 33 కరోనా కేసుల్లో ఓ వ్యక్తికి నయమవ్వడంతో డిశ్చార్జి చేసి..మరో 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సిందిగా వైద్యులు సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా బాధితుల సంఖ్య 7కు చేరాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 100 కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళలో 96 కేసులు నమోదవ్వడంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
Also Read : హైడ్రాక్సీ క్లోరోక్విన్ తో కరోనా నయమవుతుందా ?
దేశ వ్యాప్తంగా 560 జిల్లాలు షట్ డౌన్ అయ్యాయి. ఆదేశాలను బేఖాతరు చేసి రోడ్లపై తిరుగుతున్న వారి వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు. అత్యవసరంగా వైద్యం చేయించుకునే వారు మినహా ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. నిత్యావసరాలు కావాలంటే బైక్ పై ఒకరు, కారులో ఇద్దరు మాత్రమే తిరగాలని సూచిస్తున్నారు. కాదని ఎక్కువ మంది తిరిగితే మాత్రం..కఠిన చర్యలు తప్పవంటున్నారు.
వైరస్ వ్యాప్తిపై డబ్ల్యూహెచ్ఓ చీఫ్ ట్రెడ్రోస్ అధనోమ్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఇంకా వెలుగులోకి రాని కరోనా కేసులు చాలానే ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలామంది వైరస్ లక్షణాలు కనిపించకుండా తాత్కాలిక మందులు వేసుకుని కవర్ చేస్తున్నారని, ఇలాంటి వారి వల్ల వైరస్ మరింత విస్తరించే అవకాశాలున్నాయన్నారు. డిసెంబర్ నుంచి వ్యాపించడం మొదలు పెట్టిన కరోనా..లక్ష మందికి వ్యాపించడానికి 67 రోజులు పడితే..2 లక్షలకు వైరస్ విస్తరించడానికి కేవలం 11 రోజుల సమయాన్ని తీసుకుంది. మూడో లక్ష దాటేందుకు 4 రోజులే పట్టిందన్నారు. దీనిని బట్టి వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అంచనా వేయొచ్చన్నారు.
Also Read : క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన అనుష్క
భారత్ లో కరోనాను నియంత్రించేందుకు కఠిన ఆంక్షలు తీసుకున్నప్పటికీ..ఇంకా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల్లో కఠిన ఆంక్షలను అమలు చేసేందుకు వెనకాడుతున్నాయన్నారు. ఇలాంటి కఠిన సమయంలో ఆంక్షలను మరింత కఠినతరం చేయకపోతే పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందారు.
ఈ వైరస్ కు ఇంకా సరైన మెడిసిన్, వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు కానీ..వైరస్ బాధితులు వైద్యులు సూచించిన జాగ్రత్తలు తీసుకుంటూ, వారు సూచించిన మెడిసిన్ వాడటం ద్వారా వైరస్ ను తగ్గించుకోవచ్చన్నారు. అంతేగానీ వైద్యులు సూచించని మందులు వాడి ప్రాణాలమీదికి తెచ్చుకోవద్దన్నారు.
అమెరికాలో వైరస్ సోకి సోమవారం139 మంది మృతి చెందడంతో అక్కడ కరోనా మృతుల సంఖ్య 550కి చేరింది. తాజాగా మరో 10 వేల మందికి వైరస్ పాజిటివ్ రావడంతో కరోనా బాధితుల సంఖ్య 43,700కి పెరిగింది.
Also Read :కేసీఆర్ అత్యున్నత స్థాయి సమావేశం.. కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం