వాట్సాప్ పే వచ్చేసిందిగా.. పేమెంట్లు చేసేయండి..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Nov 2020 2:07 PM GMT
వాట్సాప్ పే వచ్చేసిందిగా.. పేమెంట్లు చేసేయండి..!

గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే.. ఇలా ఎన్నో పేమెంట్ యాప్స్ భారత్ లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇకపై వాట్సాప్ కూడా భారత్ లో పేమెంట్ల మోత మోగించడానికి రెడీ అయిపోయింది. పేమెంట్స్ ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకురావడంతో.. దీని ద్వారానే నగదు రహిత లావాదేవీలు చేసుకునే అవకాశం ఉంది. వాట్సప్‌లో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వాట్సప్ ఆ దిశగా ముందడుగు వేసింది. దశల వారీగా వాట్సప్‌లో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చుకోవచ్చని నేషనల్‌ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా తెలపడంతో దీనిపై ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ హర్షం వ్యక్తం చేశారు.

భారత్ లో డిజిటల్ పేమెంట్స్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి వాట్సాప్ పేమెంట్ సర్వీసెస్‌ను భారత్ లో ప్రారంభించనుంది. వాట్సప్ పే ప్రారంభించేందుకు భారతదేశం ఆమోదం తెలిపింది. ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్ పేమెంట్స్ సర్వీస్ ద్వారా మల్టీ బ్యాంక్ ఏకీకృత చెల్లింపులకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది. అమెరికాకు చెందిన వాట్సాప్ పే 20 మిలియన్ల యూజర్లతో సేవల్ని ప్రారంభించనుంది. ఫేస్‌బుక్ సంస్థ.. వాట్సప్ పేమెంట్స్‌ను భారత్ లో ప్రారంభించేందుకు కొన్నేళ్లుగా ప్రయత్నిస్తుంది గానీ.. రెగ్యులేటరీ సమస్యలతో పైలట్ ప్రాజెక్టు పరిమితమైన యూజర్లకే ఆగిపోయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులతో వాట్సాప్ పే ఒప్పందం కుదుర్చుకుంది. ఐసీఐసీఐ బ్యాంకుతో కలిసి బీటా టెస్టింగ్ ప్రారంభించింది వాట్సాప్.

నేటి నుంచి ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వీడియో ద్వారా తెలిపారు మార్క్. భారత్‌లో యూపీఐ వ్యవస్థపై ఆయన ప్రశంసలు కురిపించారు. యూపీఐతో భారత్‌ ప్రత్యేకత సాధించిందని చెప్పారు. భారత్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక సూక్ష్మ, చిన్న తరహా వ్యాపారాల్లో కొత్త అవకాశాలను సృష్టిస్తోందని చెప్పారు. ప్రపంచంలో ఇటువంటి ఘనత సాధించిన తొలి దేశం భారతేనని అన్నారు. తాము కూడా ఈ సేవల్లో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని, డిజిటల్‌ ఇండియాకు తమ వంతు సహకారం అందించే అవకాశం వచ్చిందని తెలిపారు.

Next Story