పిడుగులాంటి వార్త వినిపించిన 'వాట్సాప్‌'

By సుభాష్  Published on  14 Dec 2019 2:13 PM GMT
పిడుగులాంటి వార్త వినిపించిన వాట్సాప్‌

2019 ముగిసిపోవడానికి కొద్ది రోజుల ముందు వాట్సాప్ పిడుగు లాంటి వార్త వినిపించింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ మీద నడిచే కొన్ని స్మార్ట్ ఫోన్లకు ఇకపై వాట్సాప్ నిలిచిపోనున్నట్లు ప్రకటించింది. విండోస్ ఫోన్లకు అయితే పూర్తిగా ఈ సపోర్ట్ నిలిచిపోనున్నట్లు స్పష్టం చేసింది. వీటికి సంబంధించిన వివరాలను తన వెబ్ సైట్ లో పేర్కొంది. అంతేకాకుండా ఆయా స్మార్ట్ ఫోన్లలో కొత్త వాట్సాప్ ఖాతాను సృష్టించడం కానీ, దాన్ని వెరిఫై చేయడం వంటి అవకాశం కూడా ఉండబోదని తెలిపింది. ఇంతకీ ఏయే స్మార్ట్ ఫోన్లకు వాట్సాప్ నిలిచిపోనుందో తెలియజేసింది వాట్సాప్‌.

​ఐవోఎస్ లో ఈ ఫోన్లకు..

ఐవోఎస్ 8 లేదా దాని కంటే పాత ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టం మీద పని చేసే యాపిల్ ఫోన్లలో కూడా 2020 ఫిబ్రవరి 1 తర్వాత వాట్సాప్ పనిచేయబోదు. అప్పటి వరకు మీరు ఈ ఆపరేటింగ్ సిస్టంపై నడిచే స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ ను ఉపయోగించుకోవచ్చు. దానికి ఎటువంటి ఇబ్బందేమి ఉండదని తెలిపింది వాట్సాప్‌. ఒకవేళ ఈ ఆపరేటింగ్ సిస్టంలపై మాత్రమే నడిచే ఐఫోన్లలో కూడా మీరు వాట్సాప్ వాడాలనుకుంటే ఒకటే దారి ఉంది. ఇప్పుడు మీ ఐఫోన్ లో ఇన్ స్టాల్ అయిన వాట్సాప్ ను అప్ డేట్ చేయకూడదు. అన్ ఇన్ స్టాల్ చేసి మళ్లీ ఇన్ స్టాల్ చేయకూడదు. అప్పుడు మాత్రమే మీరు ఈ ఐఫోన్లలో వాట్సాప్ ను వాడగలరు.

​ఆండ్రాయిడ్ లో ఈ ఫోన్లకు..

ఆండ్రాయిడ్ Eclair 2.3.7 లేదా దాని కంటే పాత ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం మీద నడిచే అన్ని స్మార్ట్ ఫోన్లకు వాట్సాప్ సపోర్ట్ నిలిచిపోనుంది. ఫిబ్రవరి 1, 2020 వరకు మాత్రమే ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేస్తుందని, తర్వాత పని చేయదని వివరించింది. అలాగే విండోస్ ఆపరేటింగ్ సిస్టంపై నడిచే ఫోన్లు అన్నిటికీ ఈ సపోర్ట్ నిలిచిపోనుంది. విండోస్ ఫోన్లకు ఇంకా త్వరగా ఈ సపోర్ట్ ను నిలిపివేయనున్నారు. 2019 డిసెంబర్ 31 తర్వాత వీటికి వాట్సాప్ నుంచి ఎటువంటి అప్ డేట్స్ రావు.

విండోస్ ఆపరేటింగ్ సిస్టంలపై మాత్రమే నడిచే స్మార్ట్ ఫోన్లలో కూడా మీరు వాట్సాప్ వాడాలనుకుంటే దానికి కూడా ఒక మార్గం ఉంది. ఇప్పుడు మీ విండోస్ ఫోన్ లో ఫోన్ లో ఇన్ స్టాల్ అయిన వాట్సాప్ ను అప్ డేట్ చేయకూడదు. అలాగే అన్ ఇన్ స్టాల్ చేసి మళ్లీ ఇన్ స్టాల్ చేయకూడదు. ఎందుకంటే వాట్సాప్ మీ డివైస్ ను గుర్తించడం ఆపేస్తుంది. ఇలా చేస్తేనే మీరు విండోస్ ఫోన్లలో వాట్సాప్ ను వాడగలుగుతారు.

​మరి జియో ఫోన్లకు..

జియో ఫోన్ వినియోగదారులు ఈ అప్ డేట్ గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మధ్య జియో ఫోన్లు వాడేవారి సంఖ్య అధికంగా పెరిగిపోయింది. Kai ఆపరేటింగ్ సిస్టం 2.5.1కు పైన నడిచే అన్ని మొబైల్స్ లోనూ వాట్సాప్ పనిచేయనుంది. వీటిలో జియో ఫోన్, జియో ఫోన్ 2 కూడా ఉన్నాయి. మీరు మీ ఫోన్లలో వాట్సాప్ ను ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చేసుకుంటూ కొత్త ఫీచర్లను ఎంజాయ్ చేయవచ్చు.

వాట్సాప్ ఈ ఫోన్లకు సపోర్ట్ ను ఎందుకు నిలిపి వేస్తుందంటే..

తాము ఇకపై అందించే ఫీచర్లను అందుకోగల సామర్థ్యం ఈ ఆపరేటింగ్ సిస్టంలకు ఉండదని వాట్సాప్ పేర్కొంది. ఈ ఫోన్లు ఉపయోగించే వినియోగదారులు కొత్త ఆపరేటింగ్ సిస్టంతో నడిచే ఫోన్లకు అప్ గ్రేడ్ చేసుకోవాలని కోరింది. 2009లో తాము వాట్సాప్ ను ప్రారంభించినప్పటికీ, ఇప్పటికీ మార్కెట్లో చాలా మార్పులు వచ్చాయని, అప్పట్లో మార్కెట్లో ఉన్న స్మార్ట్ ఫోన్లలో 70 శాతం వరకు బ్లాక్ బెర్రీ, నోకియాలు అందించే ఆపరేటింగ్ సిస్టంలపై పనిచేసేవని తెలిపింది. ఇప్పుడు మార్కెట్లో 99.5 శాతం ఘా ఉన్న గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్ స్మార్ట్ ఫోన్లు అప్పట్లో కనీసం 25 శాతం కూడా లేవని తెలిపింది.

Next Story