ఎన్నికల ప్రచారం ముగిసింది..హుజూర్‌ నగర్ పరిస్థితి ఏంటీ?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Oct 2019 3:44 PM GMT
ఎన్నికల ప్రచారం ముగిసింది..హుజూర్‌ నగర్ పరిస్థితి ఏంటీ?

ఒక పక్క ఆర్టీసీ సమ్మె ఉధృతంగా సాగుతుంది. మరోపక్క హుజూర్‌ నగర్‌లో ఎన్నికల వేడి. ఆర్టీసీ సమ్మె ప్రభావం హుజూర్‌ నగర్‌పై ఉంటుందని చాలా మంది అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో హుజూర్‌ నగర్‌ లో టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ గెలిచిన సంగతి తెలిసింది. ఇప్పుడు ఆయన మీద నమ్మకంతో అధిష్టానం ఉత్తమ్ పద్మావతి రెడ్డికి టికెట్ ఇచ్చింది. ఉత్తమ్ తన భార్యను గెలిపించుకోవడానికి కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. అంతేకాదు..కాంగ్రెస్‌ నేతలను దించి ప్రచారం చేయిస్తున్నారు. డబ్బుల్లేవు..ఇదొక్కసారికి గెలిపించండి అంటూ ఓటర్లను అడుగుతున్నారు ఉత్తమ్ దంపతులు. టీఆర్‌ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి మాత్రం ప్రచారంలో దూసుకుపోతున్నారు. గెలుపు తనదే అన్నట్లు ప్రచారం చేస్తున్నారు.

ఇక...హుజూర్‌ నగర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓటమి ఖాయం అంటున్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. తెలంగాణ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలని రేవంత్ రెడ్డి హుజూర్‌ నగర్‌లో ప్రచారం చేస్తున్నారు. హుజూర్‌నగర్‌లో జరగాల్సిన సీఎం సభ రద్దైంది. వాతావరణం సరిగా లేకపోవడం సభ రద్దు అయిందని టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. అయితే..టీఆర్‌ఎస్ అభ్యర్ధి ఇప్పటికే పలుమార్లు ఓడిపోయి ఉండటంతో ప్రజల్లో సానుభూతి ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

అధికార పార్టీకి ఓటు వేస్తే పనులు జరుగుతాయని హుజూర్ నగర్‌ ప్రజలు అనుకుంటున్నట్లు టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే పనులు జరగవని ప్రజలు అనుకుంటున్నారని వారు తెలిపారు. అయితే.. కాంగ్రెస్ నేతలు మాత్రం గెలపుపై ధీమాగా ఉన్నారు. కేసీఆర్‌ నియంతృత్వ పోకడలే తమను గెలిపిస్తాయని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. కాసినోకూసిన కమ్యూనిస్టులు ఓట్లు పడ్డా..కాంగ్రెస్ కు టీఆర్ఎస్ గట్టిపోటీ మాత్రం ఇచ్చే అవకాశముంది.

ఇది ఇలా ఉంటే హుజూర్ నగర్లో ఒంటరిగా బరిలోకి దిగిన టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక..బీజేపీ ప్రభావం కూడా అంతంతా మాత్రమేనని చెబుతున్నారు. ఇక..డబ్బులు పంపకం, మద్యం సరఫరాలో అధికార పార్టీదే పైచేయిగా ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story