క్రికెట్‌ అభిమానులకు శుభవార్త.. తొలి అడుగు పడింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Jun 2020 9:54 AM GMT
క్రికెట్‌ అభిమానులకు శుభవార్త.. తొలి అడుగు పడింది

కరోనా మహమ్మారి కారణంగా క్రీడారంగం కుదేలైంది. పలు టోర్నీలు వాయిదా పడగా.. మరికొన్ని రద్దు అయ్యాయి. కరోనా వ్యాప్తిని కట్టడికి పలు దేశాలు లాక్‌డౌన్‌ విధించడంతో ఆటగాళ్లు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇక ఇప్పుడిప్పుడే చాలా దేశాలు లాక్‌డౌన్‌ లో సడలింపులు ఇస్తుండడంతో మళ్లీ క్రీడలు ప్రారంభం కానున్నాయి. అయితే ఇప్పుడప్పుడే అభిమానులను మైదానాలలోకి అనుమతించకపోవచ్చు.

క్రికెట్‌ ప్రేమికులకు నిజంగా శుభవార్త ఇది. దాదాపు మూడు నెలల తరువాత అంతర్జాతీయ క్రికెట్‌ ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య మూడు టెస్టుల మ్యాచ్‌ సిరీస్‌ ఆరంభం కానుంది. జూలై 8 నుంచి ప్రారంభం కానున్న ఈ టెస్టు సిరీస్‌ కోసం వెస్టిండీస్‌ జట్టు ఇంగ్లాండ్‌ బయలు దేరింది. ఈ విషయాన్ని విండీస్‌ క్రికెట్‌ బోర్డు తన ట్విట్టర్‌ ఖాతాలో వెల్లడించింది. ముందుగా ఆయా దీవుల్లో ఉండే వెస్టిండీస్‌ ఆటగాళ్లకు రెండు ప్రత్యేక విమానాల్లో సోమవారం ఆంటిగ్వాకు తీసుకొచ్చారు. అక్కడ విండీస్‌ క్రికెటర్లందరికి కరోనా టెస్టులు చేశారు. అందరికి పరీక్షల్లో నెగిటివ్‌ ఫలితాలు వచ్చాయి. దీంతో అందరికి ఓ ప్రైవేట్‌ ఛార్టర్‌ విమానంలో ఇంగ్లాండ్‌కు పంపించారు.

ఇంగ్లాండ్‌ చేరుకున్న అనంతరం ఆదేశ నిబంధనల ప్రకారం ఆటగాళ్లంతా క్వారంటైన్ లో ఉండాలి. అక్కడ మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. మూడు టెస్టుల సిరీస్‌ కోసం సౌథాంప్టన్‌, ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ లను వేదికలుగా ప్రకటించారు. ఈ స్టేడియాలకు అనుబంధంగా హోటల్‌కు కూడా ఉన్నాయి. దీంతో ఆటగాళ్లు ఎక్కువగా ప్రయాణం చేయవలసిన అవసరం లేదు. వెస్టిండీస్‌ ఆటగాళ్లు ఇంగ్లాండ్‌లో 7వారాల పాటు ఉండనున్నారు. అభిమానులను స్టేడియాల్లోకి అనుమతించకుండా పూర్తిగా బయో సెక్యూరు వాతావరణంలో మ్యాచులను నిర్వహించనున్నారు.



Next Story