వెస్టిండీస్ స్టార్ క్రికెట్‌ డ్వేన్ బ్రావో మంచి ఆల్‌రౌండ‌ర్ అన్న సంగ‌తి తెలిసిందే. త‌న‌లో ఓ మంచి సింగ‌ర్ కూడా ఉన్నాడ‌న్న విష‌యం చాలా త‌క్కువ మందికి తెలుసు. అత‌డు ప‌లు అల్బ‌మ్‌ల‌కు పాట‌లు కూడా పాడాడు. తాజాగా క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న త‌రుణంలో ఆ వైర‌స్ పై ఓ సాంగ్‌ను రూపొందించాడు ఈ ఆల్‌రౌండ‌ర్‌. నెవెర్ గివ్‌ అప్ పేరుతో తాను రూపొందించిన ఈ పాటను సోషల్ మీడియాలో విడుద‌ల చేశాడు. ప్రమాదకరమైన వైరస్ పై పోరాటం సాగించాలని బ్రావో ఈ సంద‌ర్భంగా సూచించాడు.

అలాగే వైర‌స్‌ను ఎదుర్కొనేందుకుగాను, చేతులను పలుమార్లు శుభ్రపరచుకోవడంతో పాటు ఇళ్ల‌ల్లోనే గడపాలని పేర్కొన్నాడు. అలాగే ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఈ వ్యాధిని అంతమొందించేందుకు ప్రజలంతా తమ వంతు సహకారాన్ని అందించాలని పేర్కొన్నాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. నెటీజ‌నంతా బ్రావో చేసిన ప్ర‌య‌త్నాన్ని అభినందిస్తున్నారు.

ఇక ఈ మ‌హ‌మ్మారి ధాటికి ప్ర‌పంచ వ్యాప్తంగా 25వేల మందికి పైగా మృతి చెంద‌గా.. ఐదుల‌క్ష‌ల మందికి పైగా క‌రోనా పాజిటిట్‌తో ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా క్రీడా రంగం కుదేలైంది. క‌రోనా ముప్పుతో కొన్ని టోర్నీలు వాయిదా ప‌డ‌గా.. చాలా టోర్నీల‌ను ర‌ద్దు చేశారు. మార్చి 29 జ‌ర‌గాల్సిన ఐపీఎల్ ఏప్రిల్ 15 వ‌ర‌కు వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ప్ర‌స్తుతం ప‌రిస్థితుల్లో ఈ ఏడాది ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ జ‌ర‌గ‌డం పై సందిగ్ధం నెల‌కొంది.


వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.