టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కెరీర్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు కామెంటేట‌ర్ హ‌ర్షా బోగ్లే. ధోని కెరీర్ ముగిసిన‌ట్లేన‌ని త‌న‌కు అనిపిస్తుంద‌న్నాడు. ఒక‌వేళ ఐపీఎల్ జ‌రిగి ఉంటే ప‌రిస్థితి వేరుగా ఉండేద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు.

గ‌తేడాది జులైలో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ సెమీఫైన‌ల్‌లో టీమ్ఇండియా నిష్క్ర‌మించ‌డంతో ధోని ఆట‌కు దూర‌మ‌య్యాడు. ఎనిమిది నెల‌లు నుంచి క్రికెట్‌కు దూర‌మ‌వ‌డంతో.. అత‌ని రాక కోసం అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. కాగా ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌-2020(ఐపీఎల్) లో స‌త్తా చాటి మ‌ళ్లీ టీమ్ఇండియా టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ఎంపిక‌వుతాడ‌నే వార్త‌లు వినిపించాయి. అందుకు త‌గ్గ‌ట్లుగానే ధోని ఇటీవ‌ల చైన్నై సూప‌ర్ కింగ్స్ ఆట‌గాళ్లతో క‌లిసి సాధ‌న చేశాడు. క‌రోనా వైర‌స్ ముప్పుతో ఏప్రిల్ 15 వ‌ర‌కు ఐపీఎల్ వాయిదా ప‌డింది. దీంతో ధోని చెన్నై నుంచి తిరిగి రాంచీకి చేరుకున్నాడు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఈసారీ ఐపీఎల్ జ‌ర‌గ‌డం అనుమానంగానే మారింది.

ఈ నేప‌థ్యంలో హ‌ర్షా బోగ్లే మాట్లాడుతూ..జాతీయ‌జ‌ట్టులో చోటు ద‌క్కించుకోవ‌డానికి ధోనికి దారులు మూసుకుపోయినట్లు తనకు అనిపిస్తుందని భోగ్లే తెలిపాడు. టీ20 ప్రపంచ కప్ కోసం ధోనీని జట్టులోకి తీసుకోవాలని టీమ్ మేనేజ్మెంట్‌ భావిస్తున్నట్లు తనకు అనిపించడం లేదని, ఒకవేళ ఐపీఎల్ జరిగి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని వ్యాఖ్యానించాడు. 2004లో అరంగ్రేటం చేసిన ధోని పదహారేళ్ళపాటు కెరీర్‌ను నడిపించాడు. 2007 నుంచి 2016 వరకు జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు

అయితే కరోనా వైరస్ కారణంగా క్రికెట్ కార్యకలాపాలు ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతాయో, స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఎలాంటి మ్యాచ్ ప్రాక్టీస్ లేని ధోనీని, తిరిగి జట్టులోకి తీసుకోకూడదని మాజీలు స్పష్టంగా అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో టీమిండియా దారులు ధోనీకి మూసుకు పోయినట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.