వందేళ్లలో ఎన్నడూ లేని రికార్డు ఉష్ణోగ్రతలు..4 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
ఏప్రిల్ నెలలో మునుపెన్నడూ లేనంత రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని చెప్పారు.
By Srikanth Gundamalla
వందేళ్లలో ఎన్నడూ లేని రికార్డు ఉష్ణోగ్రతలు..4 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
దేశంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. భానుడి భగభగలకు జనాలు ఇళ్ల నుంచి బయట అడుగుపెట్టలేకపోతున్నారు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పలువురు ఎండల కారణంగా మృతిచెందిన సంఘటనలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా భారీగా నమోదు అవుతున్న ఉష్ణోగ్రతల గురించి వాతావరణశాఖ అధికారులు ప్రకటన చేశారు. ఏప్రిల్ నెలలో మునుపెన్నడూ లేనంత రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని చెప్పారు.
గత 103 ఏళ్లలో ఎన్నడూ లేనంత అత్యధిక ఉష్ణోగ్రతలు ఈ ఏడాదిలోనే నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. వాతావరణశాఖ అందించిన వివరాల ప్రకారం 1921 తర్వాత 2024 ఏడాదికి ముందే ఏ సంవత్సరంలో కూడా 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాలేదని చెప్పారు. ఏప్రిల్‌లోనే తెలంగాణలో పలు చోట్ల 44 డిగ్రీలు దాటడం విశేషంగా మారింది. రానున్న ఐదు రోజుల్లో దేశ వ్యాప్తంగా మరిన్ని ప్రాంతాల్లో వాతావరణం మరింత వేడెక్కనుందని ఐఎండీ హెచ్చరించింది. దేశంలోని తూర్పు, దక్షిణ భాగంలో తీవ్రమైన వేడి గాలులు వీస్తాయని అధికారులు సూచించారు.
మే 3వ తేదీ వరకు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు తెలంగాణలోని వివిధ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. ఇక ఇప్పటికే అధికారులు నాలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆంధ్రప్రదేవ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్‌ను జారీ చేశారు. రానున్న మూడ్రోజుల పాటు వగాల్పుల తీవ్ర ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది. మరోవైపు మేలో జరగనున్న ఎన్నికల పోలింగ్‌పై కూడా ఎండల ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఓటింగ్ శాతం తగ్గే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.