ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం: ఐఎండీ
ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదయ్యే చాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది.
By Srikanth Gundamalla Published on 1 Aug 2023 10:07 AM ISTఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం: ఐఎండీ
జూలైలో దేశవ్యాప్తంగా పలు చోట్ల కురిసిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే వరదలు కన్నీటిని మిగిల్చాయి. ఈ క్రమంలో వచ్చే రెండు నెలలు దేశ వ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో దేశవ్యాప్తంగా 94 నుంచి 99 శాతం మధ్యలో వర్షపాతం నమోదయ్యే చాన్స్ ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మెహపాత్ర తెలిపారు. ఈశాన్య, తూర్పు ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపారు. ఎల్‌నినో కారణంగా వర్షాకాలంలో రెండో అర్ధభాగంలో వర్షాలు తగ్గుతుంటాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
దక్షిణ అమెరికా సమీపంలోని పసిఫిక్ మహా సముద్రంలో నీరు వేడెక్కుతోంది. ఎల్‌నినో ఇప్పటి వరకు రుతుపవనాల పనితీరుపై ప్రభావం చూపలేదు. కానీ.. ఆగస్టు, సెప్టెంబర్‌లో మాత్రం దీని ప్రభావం కనిపించవచ్చని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఎల్‌నినో సాధారణంలో భారత్‌లో రుతుపువనాల బలహీనత, పొడి వాతావరణంతో సంబంధం కలిగి ఉంటుంది. జూన్‌లో సాధారణం కంటే 9శాతం లోటు వర్షపాతం నమోదు అయ్యింది. ఇక జూలై వచ్చే సరికి 13 శాతం అదనంగా వానలు పడ్డాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ తెలిపారు. అయితే, తూర్పు, ఈశాన్య భారతంలో 1901 తర్వాత మొదటిసారిగా అత్యల్ప వర్షపాతం 280.9 మిల్లీమీటర్లు నమోదైందని తెలిపారు. గత ఐదేళ్లలోనే అత్యధికంగా ఈ సారి 1,113 భారీ వర్షపాతం ఘటనలు, 205 అత్యంత భారీ వర్షపాతం ఘటనలు జూలైలో నమోదయ్యాయని మృత్యుంజయ్ మెహపాత్ర చెప్పారు.
ఆగస్టు మరియు సెప్టెంబర్‌లలో తూర్పు-మధ్య భారతదేశం, తూర్పు మరియు ఈశాన్య ప్రాంతాలు, హిమాలయాల వెంబడి ఉన్న చాలా ఉపవిభాగాలలో సాధారణం నుండి ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని IMD తెలిపింది. తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో ఈ సీజన్‌లో ఇప్పటివరకు 25 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం అంచనా వేయబడింది.