ఇవాళే కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు..!
ఇక నైరుతి రుతుపవనాలు గురువారమే కేరళను తాకుతాయని భారత వాతావరణ కేంద్రం తాజాగా అంచనా వేస్తోంది.
By - Srikanth Gundamalla |
ఇవాళే కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు..!
గతేడాది ఎల్‌నినో కారణంగా వర్షాలు అంతగా పడలేదు. దాంతో.. భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. నీటికి ఇబ్బందులు తలెత్తాయి. ఇక ఈసారైనా వర్షాలు సమయానికి పడతాయా లేదా అని అంతా ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలోనే భారత వాతావరణ కేంద్రం దేశ ప్రజలకు శుభవార్త చెప్పింది. కేరళ నైరుతి రుతుపవనాలు ఈసారి సమాయానికే తీరాన్ని తాకుతాయనీ.. వర్షాలు కూడా బాగా పడతాయని చెప్పింది.
ఇక నైరుతి రుతుపవనాలు గురువారమే కేరళను తాకుతాయని భారత వాతావరణ కేంద్రం తాజాగా అంచనా వేస్తోంది. లక్షద్వీప్, కేరళలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. రాబోయే మూడు లేదా నాలుగు రోజుల్లో రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రెమాల్ తుపాను తర్వాత భానుడి ప్రతాపం మరోసారి చూపిస్తున్నాడు. దాంతో.. ఏపీ నిప్పుల గుండంలా మళ్లీ మారింది. వర్ష కాలం ఇంకా ఎప్పుడొస్తుంది బాబోయ్ అనుకుంటున్నారు ప్రజలంతా. పగటి ఉష్ణోగ్రతలు.. రాత్రి వీస్తున్న వేడి గాలులు రెండు పోటీ పడుతున్నాయి. విశాఖలో బుధవారం ఉదయం 7 గంటలకే 30 డిగ్రీల ఉష్ణోగ్రతను దాటింది అంటే అర్థం చేసుకోవచ్చు ఎండలు ఏ రేంజ్‌లో ఉన్నాయని.
ఏపీలో అత్యధికంగా ఒంగోలులో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగానే నమోదు అయ్యింది. ఇక రాష్ట్రంలో గురువారం కూడా పొడి వాతావరణ ఉంటుందనీ వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంటున్నారు. ఇక శుక్రవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో పలు చోట్లా పిడుగులతో కూడి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.