తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రెండ్రోజుల పాటు వర్షాలు

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

By Srikanth Gundamalla  Published on  27 Aug 2023 6:19 AM GMT
Rain Alert, Telugu States, Weather Report,

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రెండ్రోజుల పాటు వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు ముఖం చాటేశాడు. సీజన్‌ మొదట్లో కాస్త ఉపశమనం కల్పించి.. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అయితే.. ప్రస్తుతం మాత్రం ఎక్కడా వర్షాలు కురవడం లేదు. నగరాల్లో అయితే ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎండ మండిపోతుంది. ఈ క్రమంలోనే వర్షాలు పడితే బాగుండని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అటు రైతులు కూడా విత్తనాలు వేసి వరుణుడి రాక కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వాతావరణశాఖ అధికారులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌ న్యూస్ చెప్పారు.

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. వచ్చే రెండు రోజులు ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం.. పశ్చిమ, నైరుతి గాలులు, రుతుపవనాల ప్రభావం రాష్ట్రంలో రెండు రోజులపాటు ఉంటాయని అధికారులు చెప్తున్నారు. ఇవాళ, రేపు ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల.. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.

ఇక తెలంగాణలో రానున్న మూడ్రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ పేర్కొంది. అల్పపీడన ద్రోణి కారణంగా ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Next Story