నైరుతి రుతుపవనాలపై వాతావరణశాఖ గుడ్‌న్యూస్
రుతుపవనాలపై భారత వాతావరణశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla Published on 13 May 2024 5:15 PM ISTనైరుతి రుతుపవనాలపై వాతావరణశాఖ గుడ్‌న్యూస్
ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. అప్పుడప్పుడు చినుకులు.. మేఘాలు కమ్ముకోవడంతో కాస్త రిలీఫ్ దొరికినా ఎంతో సమయం ఇది ఉండట్లేదు. ఇక కొద్దిరోజుల ముందు అయితే.. ఉదయం 10 దాటితే బయట అడుగు పెట్టలేని పరిస్థితులు ఉన్నాయి. కాగా.. గతేడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పెద్దగా పడలేదు. నైరుతి రుతుపవనాలు కూడా దేశాన్ని సమయంలో తాకలేదు. దాంతో.. వర్షాలు పెద్దగా పడలేదు. రైతులకు.. సామాన్య ప్రజలకు ఇక్కట్లు తప్పలేదు. తాజాగా రుతుపవనాలపై భారత వాతావరణశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది.
నైరుతి రుతుపవనాలు కేరళను ఎప్పుడు తాకుతాయనే విషయంపై గుడ్‌న్యూస్ చెప్పింది ఐంఎడీ. నైరుతి రుతుపవనాలు మే 22కి బదులు మే 19 వ తేదీనే దక్షిణ అండమాన్ సముద్రం.. నికోబార్ దీవులతో పాటు ఆగ్నేయ బంగాళాఖాతంలోని పలు ప్రాంతాలను తాకుతుందని వాతావరణశాఖ వివరించింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన చేసింది. ఈ ఏడాది జూన్ 1వ తేదీకి అటు ఇటుగా నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని ఐఎండీ అంచనా వేస్తోంది. అయితే.. జులై 15వ తేదీ నాటికి దేశ వ్యాప్తంగా వర్షాల ప్రభావం ఉంటుందని తెలిపింది.
భారత్‌లో జూన్ నెల నుంచి సెప్టెంబర్ వరకు వర్షాలు కురుస్తుంటాయి. ఈ సమయంలో రైతులకు ఎంతో ముఖ్యమైనది. గత ఏడాది మాత్రం ఎల్‌నినో కారణంగా రైతులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు జూన్ రెండో వారం దాటినా కేరళను తాకలేదు. కానీ.. ఇప్పుడు మాత్రం జూన్ 1వ తేదీ వరకే నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. దాంతో.. రైతులు.. దేశ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లాంగ్ పీరియడ్ యావరేజ్లో దేశ వ్యాప్తంగా 106 శాతం వర్షపాతం నమోదయ్యే చాన్స్ ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది.