ఒకేసారి రెండు అల్పపీడనాలు.. తమిళనాడులో భారీ వర్షాలు..!
By అంజి Published on 2 Dec 2019 12:44 PM ISTహైదరాబాద్: అరేబియా సముద్రంలో ఒకేసారి రెండు అల్పపీడనాలు ఏర్పడ్డాయి. నైరుతి అరేబియా సముద్రంలో హిందూ మహా సముద్రం దిశగా భూమధ్య రేఖ వద్ద అల్పపీడనం ఏర్పడింది. ఈశాన్య అరేబియా సముద్రంలో లక్ష దీవుల వద్ద మరో అల్పపీడనం ఏర్పడింది. రెండు అల్పపీడనాలు మరో 24 గంటల్లో వాయుగుండాలుగా మారుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వీటి ప్రభావంతో ఇవాళ రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. రానున్న మూడు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో చెదురు ముదురు వర్షాలు పడే ఛాన్స్ ఉంది.
మరో వైపు తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కారణంగా పలు ప్రాంతాలు పూర్తి జలదిగ్భందనంలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. చెన్నై, కడలూరు, మదురై, కాంచీపురం, కోయంబత్తూరుతో పాటు పలు ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించింది. వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మత్స్యకారులు ఎవరూ కూడా చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు చేశారు. ఈశాన్య రుతపవనాల కారణంగా వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ తెలిపింది. తమిళనాడు రాజధాని చెన్నై పూర్తిగా నీటిలో మునిగిపోయింది. శనివారం నుంచి తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే ఐదుగురు మృతి చెందారు. కడలూరులో 17 సెం.మీ, కాంచీపురంలో సెం.మీ, టుటుకోరిన్‌లో 19 సెం.మీ, తిరునెల్వెలిలో 15 సెం.మీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షాల ధాటికి క్రోమ్‌పెట్, చిట్లపక్కం, మేడవాక్కం, మేడంమకాం, తాంబరం ప్రాంతాలు కొట్టుకుపోయాయి. వేళ ఇళ్లులు నీట మునిగాయని అధికారులు చెబుతున్నారు. కాగా వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. ఒక్క కడలూరులోనే దాదాపు 5 వేల ఇళ్లులు నీట మునిగాయి. భారీ వర్షాల వల్ల వేల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. వర్షం నీరు ఇళ్లల్లోకి చేరడంతో గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మరో రెండు లేదా మూడు రోజుల వర్షాలు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో తమిళనాడు ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. అన్నా యూనివర్సిటీ, మద్రాసు యూనివర్సిటీ పరీక్షలను అధికారులు వాయిదా వేశారు.