అండమాన్‌లో ఉపరితల ఆవర్తనం
By సుభాష్
ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీని కారణంగా ఏపీలోభారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు బంగాళాఖాతంలో ఈనెల 19న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పూర్తిగా తగ్గిపోయాయి. మధ్య భారతదేశం మీదుగా తూర్పు, పడమరగా ఏర్పడిన ద్రోణి ప్రభావం కారణంగా ఉత్తర కోస్తాలో పలు చోట్ల వర్షాలు కురిశాయి.
రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కుడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక నైరుతి రుతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, దియ ద్వీపం అంతా విస్తరించాయి. ఇక గుజరాత్, తూర్పు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాలు, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలో విస్తరించాయి.
అలాగే తెలంగాణ రాష్ట్రంలో రాగల ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదలడం వల్లే రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. మంగళవారం నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, ఖమ్మం తదితర జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.