'అత్యాచారం'పై తక్షణ న్యాయం సబబేనా? ఆయేషా మీరా కేసు ఏం చెబుతోంది?

By అంజి  Published on  7 Dec 2019 11:09 AM GMT
అత్యాచారంపై తక్షణ న్యాయం సబబేనా? ఆయేషా మీరా కేసు ఏం చెబుతోంది?

దిశ పట్ల జరిగిన ఘాతుకానికి జవాబుగా పోలీసులు నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ లో కాల్చి చంపిన ఘటన పట్ల చాలా మంది హర్షం ప్రకటిస్తున్నారు. ఇది ప్రజల్లోని కోపావేశాలకు, చట్టం న్యాయం చేయడం లేదన్న అపనమ్మకానికి ప్రతీక. నిర్భయ వంటి కిరాతకాలకు పాల్పడ్డ వారిపై ఇప్పటికీ పూర్తిగా విచారణ జరగకపోవడం, శిక్ష పడకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం ఉన్న మాట వాస్తవమే. కానీ తక్షణ న్యాయం పేరిట ఎన్ కౌంటర్లు చేయడం న్యాయమా? ఒక వేళ తరువాతి కాలంలో తూటాలకు చనిపోయిన “రేపిస్టు” నిర్దోషి అని తేలితే?

ఆయేషా మీరా కేసు...

2007 నాటి ఆయేషా మీరా కేసులో ఏమైందో ఒకసారి చూసుకుంటే విషయం అవుతుంది. గుంటూరు కు చెందిన ఆయేషా మీరా నర్సింగ్ కాలేజీలో చదువుకుంటూ ఒక హాస్టల్ లో ఉండేది. 2007 లో ఆమెను ఎవరో అజ్ఞాత వ్యక్తులు హాస్టల్ లోనే రేప్ చేసి, అత్యంత కిరాతకంగా చంపేశారు. అప్పట్లో లడ్డూ అలియాస్ గుర్వీందర్ సింగ్ అనే రౌడీ షీటర్ ను అరెస్టు చేశారు. లడ్డూ ఒక రౌడీ షీటర్. అతనిపై ఎన్నో కేసులు ఉన్నాయి. అతడిని జ్యుడిషియల్ రిమాండ్ కి పంపారు. అంతే కాదు. అతను పెట్టుకున్న పలు బెయిల్ దరఖాస్టులను కోర్టులు తిరస్కరించాయి.

Advertisement

అతడిని పాలిగ్రాఫ్ టెస్ట్ కి కూడా తీసకెళ్లాడు. అతని తరఫున వాదించిన అడ్వకేట్లు పోలీసులను లడ్డూ నేరం చేశాడని ఋజువు చేసే సాక్ష్యాధారాలున్నాయా అని పదే పదే ప్రశ్నించారు. పోలీసులు తమ వద్ద అన్ని ఆధారాలున్నాయని అన్నారు. కానీ తరువాత కాలంలో పోలీసులు లడ్డూ ఈ నేరం చేయలేదని చెబుతూ, సత్యం బాబు అనే నందిగామ యువకుడిని నేరగాడిగా చూపించారు. ఒక వేళ షాద్ నగర్ లో చేసినట్టుగా లడ్డూ ను కూడా ఎన్ కౌంటర్ చేసేసి ఉంటే...? అప్పుడు కూడా పోలీసులకు ప్రజలు గులాబీలు బహూకరించి, భుజానికెత్తుకుని అభినందించి ఉంటే...? ఆ తరువాత లడ్డూ నిర్దోషి అని తేలి ఉంటే?

Advertisement

తరువాత సత్యం బాబును దోషిగా చూపించారు. రేప్ జరిగిన తొమ్మిది నెలల తరువాత అతడిని రేపిస్టుగా చిత్రీకరించారు. అతనికి వ్యతిరేకంగా తమ వద్ద శాస్త్రీయ ఆధారాలున్నాయని, డీ ఎన్ ఏ సాంపిల్స్ ఉన్నాయని పోలీసులు వాదించారు. 2010 లో సత్యం బాబుని మహిళా కోర్టు దోషిగా నిర్ధారించింది. అతనికి యావజ్జీవ శిక్షను, రేప్ చేసినందుకు మరో పదేళ్లు అదనపు శిక్షను వేసింది. కానీ ఎనిమిదేళ్ల తరువాత జస్టిస్ సీ వీ నాగార్జున రెడ్డి. ఎం ఎస్ కే జైస్వాల్ లతో కూడిన హైకోర్టు ధర్మాసనం సత్యం ను నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు సేకరించలేదని పోలీసులకు మొట్టికాయలు వేసింది. అసలు ఆయేషా మీరా పై రేప్ జరిగినట్టు పోలీసులు ఋజువే చేయలేకపోయారు. అంత అసమర్థంగా ఈ కేసు నడిచింది. ఈ కేసులో తప్పుడు విచారణ చేసిన పోలీసులను శిక్షించాలని కూడా న్యాయస్థానం తీర్పు చెప్పింది. అసలు నేరస్థులను తప్పించేందుకు తనను ఈ కేసులో ఇరికించారని సత్యం బాబు ఆరోపించారు.

చేయని నేరానికి శిక్ష..

చేయని నేరానికి శిక్ష అనుభవించిన సత్యం బాబును, ఏమీ చేయకుండానే నెలల పాటు జైల్లో గడిపిన లడ్డూలపై నేటి దిశ కేసులో లాగానే సీన్ ను రీకన్ స్ట్రక్ట్ చేయించే పేరిట తీసుకెళ్లి ఎన్ కౌంటర్ చేయించి ఉంటే? నిర్దోషులను తూటాలకు బలి చేసేసి ఉంటే? అసలు కేసుతో సంబంధం లేని సత్యం బాబును ఏళ్ల తరబడి జైల్లో మగ్గేలా చేసినవారు కానీ, లడ్డూ ను బంధించి చిత్ర హింసలు పెట్టిన వారు కానీ జవాబు చెప్పగలరా? తక్షణ న్యాయంపేరిట న్యాయం జరగకుండా చూసే ధోరణి సరైనదేనా?

Next Story
Share it