దక్షిణాఫ్రికా క్రికెటర్‌ 'హోటల్‌' అరెస్టు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 March 2020 7:18 PM IST
దక్షిణాఫ్రికా క్రికెటర్‌ హోటల్‌ అరెస్టు

కరోనా వైరస్‌(కొవిడ్‌-19) పేరు చెబితే చాలు అందరూ వణికిపోతున్నారు. ఇప్పటికే ఈ మహమ్మారి భారీన పడి 9వేల మంది మృత్యువాత పడగా.. 2లక్షల మంది దీని భారీన పడ్డారు. ఇక ఈ వైరస్‌ ముప్పు నేపథ్యంలో ఇప్పటికే పలు క్రీడా టోర్నీలు వాయిదా పడ్డాయి. తొలిసారి పాకిస్థాన్‌ గడ్డపై పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌) నిర్వహించింది. లీగ్‌ దశ వరకు బాగానే సాగిన ఈ లీగ్‌ను అర్థాంతరంగా రద్దు చేశారు. ఇంగ్లాండ్‌ క్రికెటర్‌కు అలెక్స్‌ హేల్స్‌కి కరోనా లక్షణాలు బయటపడడంతో వెంటనే టోర్నీని రద్దు చేశారు.

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా.. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ కొన్ని గంటల పాటు పాకిస్థాన్‌లో హోటల్ అరెస్ట్‌లో ఉన్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌ ఆడేందుకు అక్కడికి వెళ్లిన స్టెయిన్‌‌.. ఇస్లామాబాద్ యునైటెడ్ టీమ్ తరఫున మ్యాచ్‌లు కూడా ఆడాడు. కరోనా నేపథ్యంలో పీఎస్‌ఎల్‌ని అర్ధాంతరంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు రద్దు చేసింది. స్వదేశాలకి వెళ్లాలనుకున్న విదేశీ క్రికెటర్లకి పరీక్షలు నిర్వహించి.. నెగటివ్ అని తేలితేనే ప్రయాణానికి అనుమతిచ్చింది. ఇంగ్లాండ్ క్రికెటర్‌ అలెక్స్ హేల్స్‌కి తొలుత కరోనా వైరస్ లక్షణాలు బయటపడటంతో.. ఆగమేఘాల మీద అతడ్ని స్వదేశానికి పంపించింది. లీగ్‌లో ఆడిన విదేశీ ఆటగాళ్లకు వైరస్‌ సోకిందేమోనని కరోనా పరీక్షలు నిర్వహించింది.

పరీక్షలకి పంపిన శాంపిల్స్ రిపోర్ట్ రావడం ఆలస్యం కావడంతో అప్పటి వరకూ క్రికెటర్లని హోటల్ గదులకే పరిమితం చేసిందిపాకిస్థాన్. ఆ సమయంలో తన పరిస్థితి గురించి డెల్ స్టెయిన్ వివరించాడు.‘ఆటగాళ్లందరూ.. హోటల్ అరెస్ట్‌లో ఉండిపోయాం. హోటల్నీ దాటి వీధుల్లోకి రకూడని ఆదేశాలు జారీ చేశారు. వ్యక్తిగతంగా నాకు కూడా ఆ నిబంధనల్ని అతిక్రమించాలని అనిపించలేదు.. ఒకవేళ నేను ఏదైనా పిచ్చి పని చేస్తే..? ఆ తర్వాత మళ్లీ పాకిస్థాన్‌‌లో క్రికెట్‌ ఆడలేనని నాకు తెలుసు’ అని తెలిపాడు.

టెస్టులకి రిటైర్‌మెంట్‌ ప్రకటించిన ఈ పేసర్‌.. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌లో ఆడాలని భావిస్తున్నాడు. అయితే ఫామ్‌లో లేని ఈ బౌలర్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఎంపిక చేయడం లేదు. దీంతో విదేశీ లీగ్స్‌ ఆడుతూ.. తన ఫామ్‌ నిరూపించుకునే పనిలో ఉన్నాడు ఈ ఫాస్ట్‌బౌలర్‌. కాగా.. ఐపీఎల్ 2020 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున బరిలోకి దిగననున్నాడు. కాగా.. మార్చి 29 ప్రారంభం కావాల్సిన ఐపీఎల్‌ కరోనా ముప్పుతో ఏప్రిల్‌ 15కి వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Next Story