ఆసీస్ ఆటగాళ్లను ఆశ్చర్యపరిచిన ఆ వాటర్ బాయ్ ఎవరు?
By న్యూస్‌మీటర్ తెలుగు
కాన్‌బెర్రా : ఆస్ట్రేలియా - శ్రీలంక మధ్య టీ20 వార్మప్ మ్యాచ్ జరుగుతుంది. ఆటగాళ్లు డ్రింక్స్ విరామం తీసుకున్నారు. కొత్త వాటర్ బాయ్ రావడం ఎవరూ గమనించలేదు. దగ్గరకు వచ్చే వరకు ఎవరూ చూడలేదు.దగ్గర నుంచి చూశాక అందరూ ఆశ్చర్యపోయారు. స్వయంగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తమ దేశ ఆటగాళ్ల కోసం వాటర్ బాయ్ అవతారమెత్తాడు.
మూడు మ్యాచ్‌ల టీ20 కోసం శ్రీలంక జట్టు ఆస్ట్రేలియలో పర్యటిస్తుంది. ఆదివారం అడిలైడ్ వేదికగా మొదలుకానున్న తొలి టీ20 మ్యాచ్ కోసం రెండు జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో కంగారూ(ప్రైమ్ మినిస్టర్ XI)- లంక జట్లు గురువారం వార్మప్ మ్యాచ్‌లో తలపడ్డాయి. కాన్‌బెర్రాలోని ఓవల్ మైదానంలో మ్యాచ్ జరిగింది. శ్రీ లంక ఆటగాళ్లు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో... ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్ ఒక్కసారిగా మైదానంలోకి పరుగెత్తుకు వచ్చారు. మ్యాచ్ 16వ ఓవర్‌లో తమ క్రికెటర్ల కోసం వాటర్ బాటిల్స్ తీసుకువచ్చారు. ఊహించని ఈ పరిణామంతో ఆసీస్ ఆటగాళ్లు షాక్‌కు గురయ్యారు. అంతేకాదు..చిరు నవ్వులు చిందిస్తూ తమ ప్రధానికి షేక్ హ్యాండ్ ఇచ్చారు ఆసీస్ ఆటగాళ్లు. ప్రధాని వాటర్ బాయ్ అవతారమెత్తిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఆసీస్ క్రికెట్లకు వాటర్ బాయ్‌గా సేవలు అందించి ప్రధాని స్కాట్ మారిసన్.. ఈ ప్రపంచంలో ఏ పనిని కూడా తక్కువగా చూడకూడదని నిరూపించారు. మీరు గ్రేట్ సార్. హాట్సాఫ్’ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.