యూట్యూబ్‌ వీడియోలను చూస్తూ ప్రసవం.. అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువతి.. చివరికి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 March 2020 8:15 AM GMT
యూట్యూబ్‌ వీడియోలను చూస్తూ ప్రసవం.. అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువతి.. చివరికి

ఓ యువకుడు కళాశాల విద్యార్థిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని యువతిని గర్భవతిని చేశాడు. ప్రసవ నొప్పులు రావడంతో.. ఆ యువకుడు యూట్యూబ్‌ వీడియోలు చూసి యువతికి ప్రవసం చేయడానికి యత్నించాడు. దీంతో.. గర్భంలోని శిశువు మృతి చెందగా.. యువతికి తీవ్ర రక్తస్రావం అయ్యింది. భయపడిన ఆయువకుడు బాలికను అతికష్టం మీద ఆస్పత్రికి తరలించాడు. యువతికి ప్రసవం చేయడానికి యత్నించినందుకు గానూ ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

తమిళనాడులోని గుమ్మిడిపూండికి చెందిన సౌందర్‌(27) ఓ గ్యాస్‌ ఏజెన్సీలో సిలిండర్లు సరఫరా చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ విద్యార్థినికి దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతిని గర్భవతిని చేశాడు. ఇటీవల యువతి శరీరంలో మార్పులను గమనించిన ఆమె తల్లిదండ్రులు పలుమార్లు ప్రశ్నించినా సాధారణ అనారోగ్యం అని చెబుతూ వచ్చింది. ఈ క్రమంలో యువతికి 8నెలలు నిండాయి. బుధవారం ప్రసవ నొప్పులు రావడంతో సౌందర్‌కి ఫోన్‌ చేసి చెప్పింది.

వెంటనే అతడు గమ్మిడిపూండిలోని ఓ దుకాణంలో గ్లౌజులు, కత్తెర. బ్లేడు తదితర వస్తువులను కొనుగోలు చేశాడు. యువతిని కమ్మవారుపాళ్యం సమీపంలోని అడవికి తీసుకెళ్లాడు. యూట్యూబ్‌ వీడియోలు చూస్తూ ప్రసవం చేయడం ప్రారంభించాడు. బ్లేడుతో కోయడంతో గర్భసంచిలోని శిశువు చేయి తెగిపోయింది. దీంతో పాటు యువతి పేగు కూడా తెగడంతో తీవ్రరక్తస్రావమైంది. ఫలితంగా.. యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. భయపడిన యువకుడు.. యువతిని అతి కష్టం మీద పొన్నేరి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. వైద్యులు యువతిని చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆపరేషన్‌ చేసి గర్భంలోని మగ శిశువు మృతదేహాన్ని బయటకు తీశారు. ప్రస్తుతం యువతి పరిస్థితి నిలకడగా ఉంది. పోలీసులు నిందితుడు సౌందర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Next Story
Share it