అంతా మీ చేతుల్లోనే..
By రాణి Published on 11 Feb 2020 12:22 PM GMTఒకదాని తర్వాత ఒక అంటురోగం ప్రబలుతూనే ఉన్నాయి. ఒక దేశంలో ఉన్న వైరస్ మరో దేశానికి మనుషుల ద్వారా ఈజీగా వ్యాప్తి చెందుతోంది. ఎప్పుడైతే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందని తెలిసిందో అప్పుడే అప్రమత్తమయ్యారు అన్ని దేశాల అధికారులు. ముఖ్యంగా ఎయిర్ పోర్టులలోనే క్షుణ్ణంగా తనిఖీ చేసి మరీ పంపుతున్నారు. అంతేకాదు ప్రయాణీకుల్లో కూడా మార్పు రావాల్సిందేనని అంటున్నారు రీసెర్చర్లు..!
ప్రపంచంలో పాపులర్ అయిన 10 ఎయిర్ పోర్టుల్లో ప్రయాణించే వారు చేతులు కడిగే అలవాట్లలో చాలా వరకూ మార్పు వస్తే చాలా వైరస్ ల వ్యాప్తిని అరికట్టే అవకాశాలు అధికంగా ఉంటాయని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మసాచుసెట్స్(MIT) కు చెందిన రీసెర్చర్లు చేసిన స్టడీలో తెలిసొచ్చింది. విమానాల్లో ప్రయాణించే వారి అలవాట్లలో మార్పు రావడం వలన చాలా వరకూ వైరస్ ల వ్యాప్తి తగ్గుతుందని అంటున్నారు. ఎయిర్ పోర్టుల్లో విపరీతమైన రద్దీగా ఉన్నప్పటికీ చేతులు కడుక్కోవడానికి ప్రయాణీకులు ప్రాధాన్యతను చూపిస్తే వైరస్ ల వ్యాప్తి అన్నది భారీగా తగ్గుతుంది. ప్రపంచంలోని వివిధ దేశాల నుండి ఎయిర్ పోర్టులకు వచ్చే వారు అక్కడి ఛైర్లు, ఆర్మ్ రెస్టులు, చెక్ ఇన్ సాధనాలు, సెక్యూరిటీ చెక్ పాయింట్ ట్రేలు, రెస్ట్ రూమ్ డోర్ లను ముట్టుకుంటూ ఉంటారు. అందువలన వైరస్ లు వాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంది.
60 శాతం చేతులు శుభ్రం చేసుకోవాలి
ఇంతకు ముందు చేసిన రీసెర్చ్ ప్రకారం ఎయిర్ పోర్టుల్లో ఉండే ప్రయాణీకుల్లో కేవలం 20 శాతం మంది మాత్రమే చేతులను శుభ్రంగా ఉంచుకుంటున్నారని తెలుస్తోంది. అంటే ఈ 20 శాతం మాత్రమే చేతులను సోప్ తో కడుక్కోవడం లాంటివి చేస్తున్నారు. మిగతా 80 శాతం మంది మాత్రం ఏది పడితే దాన్ని పట్టుకుని క్రిములు ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందేలా చేస్తున్నారని రీసెర్చర్లు చెబుతున్నారు. "టాయ్ లెట్ కు వెళ్లే వారిలో 70శాతం మంది మాత్రమే చేతులు కడుక్కుంటున్నారని" యూనివర్శిటీ ఆఫ్ సైప్రస్ కు చెందిన ప్రొఫెస్సర్ క్రిస్టోస్ నికోలైడెస్ చెబుతున్నారు. 'మిగిలిన 30 శాతం మాత్రం కనీసం చేతులు కడుక్కోవాలి అనుకోవడం లేదని.. కడుక్కున్న 70 శాతం మందిలో 50 శాతం మాత్రమే సోప్ లాంటివి ఉపయోగించి కడుక్కుంటున్నారని' నికోలైడెస్ చెప్పారు. చేతులను శుభ్రంగా ఉంచుకుంటున్న వారి శాతాన్ని మూడు రెట్లు పెంచాలని.. 60 శాతం ప్రయాణీకులు చేతులను శుభ్రంగా ఉంచుకుంటే వైరస్ వ్యాప్తి చెందకుండా చాలా వరకూ అరికట్టవచ్చని.. అదే 70 శాతానికి తీసుకొని వస్తే పలు రోగాలు ప్రబలకుండా అరికట్టే అవకాశం ఉందని రీసెర్చర్లు చెబుతున్నారు.
ఎయిర్ పోర్టుల్లో ప్రయాణీకులు చాలా బిజీగా తిరుగుతూ ఉంటారు.. ప్రతి ఒక్కరినీ పిలిచి చేతులు కడుక్కున్నారా లేదా అని ప్రశ్నించడం అన్నది చాలా కష్టమైనదే..! ప్రాక్టికల్ గా ఇలాంటి మార్పు తీసుకొని రాలేమని కూడా రీసెర్చర్లు చెబుతున్నారు. ఎప్పుడైతే ప్రపంచంలోని టాప్-10 ఎయిర్ పోర్టులలో ప్రయాణించే వారి చేతులను శుభ్రంగా ఉంచుకునే పద్ధతి మారితే 37శాతం వరకూ వైరస్ లను వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చు. చిన్న చిన్న పద్ధతుల్లో మార్పులు వస్తే వైరస్ వ్యాప్తిని చాలా సులభంగా అరికట్టవచ్చని చెబుతున్నారు రీసెర్చర్స్. ఇక ప్రపంచంలోని అన్ని ఎయిర్ పోర్టులలో చేతులను కడుక్కోవడం 10శాతం పెరిగితే 24శాతం వరకూ వైరస్ లు వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చట.