వార్నర్‌ను ఊరిస్తున్న రెండు రికార్డులు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 Oct 2020 11:09 AM GMT
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. వరుస పరాజయాలతో డీలాపడ్డ సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ కేవలం మూడు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. అబుదాబీ వేదికగా ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరచుకోవాలని సన్‌రైజర్స్ బావిస్తోంది.
ఇదిలా ఉంటే.. సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఓ అరుదైన రికార్డు ముంగిట నిలిచాడు. ఈమ్యాచ్‌లో వార్నర్ మరో 10 పరుగులు చేస్తే చాలు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 5 వేల పరుగుల మైలురాయిని అందుకున్న విదేశీ ప్లేయర్‌గా రికార్డ్ క్రియేట్ చేస్తాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ సురేష్ రైనా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాత్రమే 5వేల పరుగుల మైలురాయిని అందుకున్నారు. సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ 134 ఇన్నింగ్స్‌ల్లో 4,990 రన్స్ చేశాడు. మరో పది పరుగులు చేస్తే.. ఐపీఎల్‌లో వేగంగా 5 వేల రన్స్ చేసిన ఆటగాడిగా కోహ్లీ (157) రికార్డును వార్నర్ అధిగమిస్తాడు.
వార్నర్ సేన ముందుకు వెళ్లాలంటే ఇక నుంచి ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ గెలవాల్సిన పరిస్థితి ఉంది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 18 మ్యాచుల్లో తలపడగా.. కోల్‌కత్తా 11 విజయాలతో పై చేయి సాధించింది. ఈ సీజన్‌లో రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత్తానే విజయం వరించింది. ఈ రోజు మ్యాచ్ జరగనున్న అబుదాబి మైదానంలో హైదరాబాద్ గతంలో మూడు మ్యాచులు ఆడి ఒకదాంట్లో మాత్రమే గెలిచింది.