బండరాయితో కొట్టి.. భవనం పై నుంచి కిందపడేసి..
By Newsmeter.Network Published on 24 Jan 2020 9:01 PM IST
చిలకలగూడ ఇంటర్ విద్యార్థిని హత్య కేసును పోలీసులు ఛేదించారు. పెళ్లికి నిరాకరించిందన్న కారణంతోనే విద్యార్థినిని హత్య చేసినట్లు నార్త్ జోన్ డీసీపీ కమలేశ్వర్ తెలిపారు. డీసీపీ కమలేశ్వర్ తెలిపిన వివరాల మేరకు.. నిందితుడు షోయబ్, హత్యకు గురైన విద్యార్థిని ఇద్దరూ ఒకే పాఠశాలలో చదువుకున్నారని, అప్పటినుంచి ఇద్దరికి పరిచయం ఉందన్నారు. షోయబ్ ఫ్లెక్సీ బోర్డ్ డిజైనర్‌గా పని చేసేవాడనీ, గతంలో పెళ్ళి చేసుకుంటానని బాలిక కుటుంబ సభ్యులకు షోయబ్ చెప్పాడన్నారు. బాలిక మైనర్ కావడంతో విద్యార్థిని తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదని.. అప్పటినుంచి బాలిక షోయబ్‌ను పట్టించుకోవడం మానేసిందన్నారు.
ఈ క్రమంలో గురువారం అర్థరాత్రి దాటిన తరువాత షోయబ్ బాలిక ఇంటికి వచ్చాడని, ఇద్దరూ కలిసి బాలిక ఇంటిపైకి వెళ్లి మాట్లాడుకున్నారని తెలిపారు. అక్కడ ఇద్దరి మధ్య ఏదో విషయంలో వాగ్వాదం చోటు చేసుకుందని, ఆగ్రహానికి గురైన నిందితుడు షోయబ్ అక్కడే ఉన్న బండరాయితో ఆమె తలపై కొట్టాడని తెలిపారు. ఆపై బాలికను ఈడ్చుకుంటూ వెళ్ళి పైనుంచి కిందకు పడేశాడని చెప్పారు. అనంతరం అక్కడినుంచి తన ఇంటికి వెళ్ళిపోయాడన్నారు.
డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందిందని.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారన్నారు. మృతురాలి శరీరంపై గాయాలున్నట్లు గర్తించామన్నారు. షోయబ్ ప్రేమ పేరుతో గత కొన్ని రోజులుగా వేధిస్తున్నాడని.. తానే హత్య చేసి ఉంటాడని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు.
దీంతో నిందితుడు షోయబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టామన్నారు. సీసీ టీవీ ఫుటేజీలను కూడా పరిశీలించామని.. అందులో షోయబ్ చిత్రాలు రికార్డు అయ్యాయని డీసీపీ తెలిపారు. నిందితుడిని విచారిస్తున్నామని.. సరైన సమయంలో నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామన్నారు.