బిడ్డకు పాలిచ్చిన కాసేపటికే బాలింత మృతి
వరంగల్ సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 19 Aug 2023 9:41 AM IST బిడ్డకు పాలిచ్చిన కాసేపటికే బాలింత మృతి
వరంగల్ సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. బిడ్డకు పాలుపట్టించి కాసేపు ఒరిగిన బాలింత కార్డియాక్ అరెస్ట్‌తో ప్రాణాలు కోల్పోయింది.
వర్ధన్నపేట మండలం ఇల్లందు గ్రామానికి చెందిన సుస్మిత ప్రసవం కోసం ఈ నెల 13న సీకేఎం ఆస్పత్రిలో చేరింది. ఆగస్టు 16న ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. బాబుకి అనారోగ్య సమస్యలు ఉన్నాయి.. ఆస్పత్రిలోనే వైద్యుల సంరక్షణలో ఉంచాలని తెలిపారు. దాంతో.. తల్లిదండ్రులు నవజాత శిశుసంరక్షణ కేంద్రంలో చేర్చారు. చికిత్స పొందుతున్న బిడ్డకు పాలుపడుతూ ఉంది. సీమాంక్ వార్డులో ఉన్న సుస్మిత ఎప్పటిలానే శుక్రవారం తెల్లవారుజామున కూడా 4 గంటల సమయంలో బిడ్డకు పాలుపట్టింది. ఆ తర్వాత పక్కవార్డులో నిద్రపోయింది. ఉదయం 6 గంటలు అయినా ఆమె నిద్రలేవలేదు. దాంతో కుటుంబ సభ్యులు ఎందుకు ఇంకా మేల్కొనడం లేదని సుస్మితను తట్టి లేపే ప్రయత్నం చేశారు. కానీ.. ఆమెలో ఎలాంటి చలనం లేదు.
దాంతో.. భయపడిపోయిన కుటుంబ సభ్యులు వెంటనే వైద్యులకు సమాచారం ఇచ్చారు. డాక్టర్లు సుస్మితను పరిశీలించి ఆమె కార్డియాక్ అరెస్ట్‌కు గురైనట్లు గుర్తించారు. వెంటనే సీపీఆర్ చేసి బతికించేందుకు ప్రయత్నాలూ చేశారు. కానీ ఫలితం లేకపోయింది. సుస్మిత ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు నిర్ధారించారు. సుస్మితకు ఇదే మొదటి కాన్పు. మగబిడ్డకు జన్మనివ్వడంతో ఎంతో సంతోషంలో ఉన్న కుటుంబ సభ్యులు.. సుస్మిత చనిపోవడంతో కన్నీరుమున్నీరు అవుతున్నారు. బిడ్డకు తల్లి లేకుండా పోయిందంటూ ఆవేదన చెందుతున్నారు.