కేయూలో ర్యాగింగ్ కలకలం, 81 మంది అమ్మాయిలపై సస్పెన్షన్

వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్‌ ఘటన సంచలనంగా మారింది.

By Srikanth Gundamalla  Published on  23 Dec 2023 10:15 AM IST
warangal, kakatiya university, ragging, 81 students, suspend,

కేయూలో ర్యాగింగ్ కలకలం, 81 మంది అమ్మాయిలపై సస్పెన్షన్

వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్‌ ఘటన సంచలనంగా మారింది. అదికూడా లేడీస్‌ హాస్టల్‌లో అమ్మాయిలు ర్యాగింగ్‌కు పాల్పడటం చర్చనీయాంశం అయ్యింది. జూనియర్ విద్యార్థులపై అమ్మాయిలు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. గత కొన్ని రోజులుగా ర్యాగింగ్‌ వ్యవహారం జరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు తాజాగా చర్యలు తీసుకున్నారు. ర్యాగింగ్‌కు పాల్పడుతున్న కారణంగా ఏకంగా 81 మంది విద్యార్థినులపై సస్పెన్షన్ వేటు వేశారు యూనివర్సిటీ అధికారులు. ఇలా ఒకేసారి పెద్ద మొత్తంలో విద్యార్థులను సస్పెన్షన్ చేయడం యూనివర్సిటీ చరిత్రలో ఇదే తొలిసారి.

వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో జూనియర్లను పరిచయాల పేరుతో పీజీ ఫైనల్ ఇయర్ విద్యార్థినులు ర్యాగింగ్ చేసినట్లు వర్సిటీ అధికారుల దృష్టికి వచ్చింది. దాంతో.. వారు స్పందించారు. వెంటనే రంగంలోకి దిగారు. పద్మావతి మహిళా వసతి గృహంలో ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థినుల వివరాలను సేకరించారు. ఆతర్వాత అన్ని విషయాలను నిర్ధారించుకున్న తర్వాత 81 మంది అమ్మాయిలను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో పీజీ విద్యార్థినులు 28 మంది, కామర్స్‌ అమ్మాయిలు 28 మంది, జువాలజీ సెకండ్ ఇయర్ విద్యార్థినులు కూడా ఉన్నారు. అయితే.. వీరందరిపై వారం రోజుల పాటు సస్పెన్షన్ ఉంటుందని చెప్పారు.

కాకతీయ యూనివర్సిటీలోని మిగతా విభాగాల్లో కూడా ర్యాగింగ్‌కు పాల్పడిన వారి వివరాలను సేకరించే పనిలో పడ్డారు వర్సిటీ అధికారులు. ర్యాగింగ్‌కు పాల్పడినట్లు తేలితే వారిని కూడా సస్పెండ్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇక శనివారం నుంచి డిసెంబర్ 31వ వరకు క్రిస్మస్‌ సెలవులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు హాస్టల్స్‌ ఖాళీ చేయాలని సూచించారు. భవిష్యత్‌లో కూడా ఇలా ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

Next Story