డ్రంక్‌ అండ్ డ్రైవ్‌లో పట్టుబడి బైక్‌కు నిప్పు పెట్టిన వ్యక్తి

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో పట్టుబడ్డ ఓ వ్యక్తి హంగామా చేశాడు. ఏకంగా తన బైక్‌కే నిప్పు పెట్టాడు.

By Srikanth Gundamalla  Published on  4 Sep 2023 5:04 AM GMT
Warangal, Drunk and drive,  bike fire,

డ్రంక్‌ అండ్ డ్రైవ్‌లో పట్టుబడి బైక్‌కు నిప్పు పెట్టిన వ్యక్తి

మద్యం సేవించి వాహనాలు నడపొద్దని.. ప్రమాదాలు జరుగడానికి ప్రధాన కారకులు కావొద్దని పోలీసులు హెచ్చరిస్తుంటారు. కానీ.. కొందరు డ్రింకర్స్‌ మాత్రం మద్యం సేవించే వాహనాలు నడుపుతున్నారు. ఎంజాయ్‌ చేయాలంటూ చెబుతుంటారు. అయితే.. కొన్ని చోట్ల పోలీసులు ఇలాంటి వారిని పట్టుకునేందుకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపడుతుంటారు. ఈ క్రమంలో పట్టుబడ్డ వారు నానా హంగామా చేయడం ఇప్పటికే చాలా చూశాం. పోలీసులతో వాగ్వాదానికి దిగి.. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తమకే తెలియకుండా ప్రవర్తిస్తుంటారు. తాజాగా వరంగల్‌లోనూ ఓ వ్యక్తి ఇలాగే ప్రవర్తించాడు. ఏకంగా తన బైక్‌కే నిప్పు పెట్టాడు.

వరంగల్‌ ట్రాఫిక్ ఎస్‌ఐ రవి ఆధ్వర్యంలో శనివారం రాత్రి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. శివనగర్‌ ప్రాంతానికి చెందిన పులిశేరు శివ ఫుల్లుగా మద్యం సేవించి బైక్‌పై వస్తున్నాడు. అయితే.. పోలీసులు డ్రంక్‌ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారనే విషయాన్ని గమనించి.. ప్రధాన తపాలా కేంద్రం కూడలి రహదారి పక్కనే బైక్‌ నిలిపేశాడు. ఆ తర్వాత రోడ్డు దాటుతుండగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు. మద్యం సేవించి ఇక్కడి వరకు బైక్‌ నడుపుతూ వచ్చావని.. తనపై కేసు నమోదు చేస్తామని పోలీసులు అన్నారు. దాంతో.. శివ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు.

మద్యం సేవించింది నిజమే కానీ.. బైక్‌ నడుపుతూ పట్టుబడకుండా కేసు ఎలా నమోదు చేస్తారని శివ హంగామా చేశాడు. ఆ తర్వాత కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పడంతో.. శివ తన బైక్ పెట్రోల్‌ పైపుని తొలగించి నిప్పు అంటించాడు. దాంతో.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తం అయ్యిన పోలీసులు పక్కనే ఉన్న దుకాణంలోని నీళ్లను తీసుకొచ్చి మంటలను ఆర్పేశారు. ఆ తర్వాత శివకు చెందిన బైక్‌ను సీజ్‌ చేసి.. వరంగల్ రైల్వే స్టేషన్ పార్కింగ్ కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story