ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర, దక్షిణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనుంది. నాలుగు రోజుల పాటు జరిగే జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.75 కోట్ల నిధులను విడుదల చేసింది. జాతర సమయం దగ్గర పడుతుండడంతో.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మేడారం జాతరకు వెళ్లే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది.
మేడారం జాతర కోసం ప్రత్యేకంగా 3,850 బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. జాతర జరిగే రోజులలో తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి రవాణా సమస్యలు తలెత్త కూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఉమ్మడి వరంగల్ రీజన్ నుంచే అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఆ ఒక్క రీజియన్ నుంచే 2,250 బస్సులను నడపనున్నారు. ఇక రాజధాని హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఏసీ బస్సులను నడపనున్నారు.
ఈ జాతరకు దాదాపు 21 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసి.. ముప్పై ఎనిమిది వందల యాభై బస్సులను నడపాలని నిర్ణయించారు. ఇక జాతర ప్రాంతంలో బస్సులను నిలిపి ఉంచేందుకు 50 ఎకరాల్లో భారీ బస్టాండ్‌ను నిర్మిస్తున్నారు. టికెట్లు క్యూ కోసం స్థలాన్ని చదును చేసే పనులు నిన్ననే(బుధవారం) ప్రారంభమయ్యాయి.