'బాసర తరహాలో.. బమ్మెరలో అక్షరాభ్యాస మందిరం, కళ్యాణ మండపాలు'
The public poet Bammera Potana Jayanti celebrations were held grandly. సహజ కవి, సుమధుర కవి బమ్మెర పోతన జయంతి ఉత్సవాలు ఆయన జన్మస్థలం జనగామ జిల్లా పాలకుర్తి మండలం
By అంజి Published on 5 Sept 2022 8:07 AM ISTసహజ కవి, సుమధుర కవి బమ్మెర పోతన జయంతి ఉత్సవాలు ఆయన జన్మస్థలం జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామంలో ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో రాష్ట్ర పంచాయతీరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామంలోని పోతన మందిరాన్ని సందర్శించారు. పోతన చిత్ర పటానికి పూలు చల్లి పుష్పాంజలి ఘటించారు. అదే ఆవరణలో గల శ్రీ సీతా సమేత శ్రీ రామచంద్ర ఆలయంలో పూజలు చేశారు. మంత్రికి ఆలయ అర్చకులు, గ్రామ ప్రజలు ఘనంగా పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం జరిగిన కవి సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు.
మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. '' బమ్మెర పోతన మన వాడు కావడం మన అదృష్టం. ఈ ప్రాంతం ఆదికవి పాల్కురికి సోమనాథుడి జన్మస్థలం. బమ్మెర పోతనకు కూడా బమ్మెర జన్మస్థలం. వాల్మీకి మహర్షి తపస్సు చేసిన నేల వల్మీడి ఈ పక్కనే ఉంది. తెలుగు కవిత్వంలో ఇంత గొప్ప కవులు, పండితులు ఇద్దరూ ఇక్కడి వారే కావడం ఈ నేల చేసుకున్న పుణ్యం. బమ్మెర పోతన గొప్ప కవి. ప్రజా కవి. సహజ కవి. అటు పండితులను ఇటు పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. సంస్కృతంలో ఉన్న భాగవతాన్ని తెలుగులో అనువదించిన మహాకవి పోతన.'' అని అన్నారు.
ఈ ప్రాంతాన్ని పాలకుర్తి - బమ్మెర - వల్మిడి కారిడార్ గా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. పాలకుర్తిలో సోమేశ్వర స్మారక స్థూపం, కళ్యాణ మండపం, గుట్టపైన గిరి ప్రదక్షిణ, విద్యుదీకరణ, నీటి వసతి, ఆలయ ఆధునీకరణ పనులను చేపట్టడం జరిగిందన్నారు. బమ్మెరలో అక్షరాభ్యాస మందిరం, కళ్యాణ మండపాలను బాసర తరహాలో నిర్మిస్తున్నామని చెప్పారు. వల్మీడిలో దేవాలయ ప్రధాన ఆలయం ఆధునీకరణ, పాకశాల, రోడ్డు పనులను చేపట్టామన్నారు. గతంలో సీఎం కెసిఆర్ ఈ ప్రాంతాన్ని సందర్శించి పాలకుర్తికి రూ.10 కోట్లు, బమ్మెరకు రూ.7.50 కోట్లు, వల్మీడీకి రూ.5 కోట్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందేనని, ఇంకా అవసరమైన నిధులను మంజూరు చేయిస్తానని అన్నారు.
బమ్మెర పోతన సమాధి దగ్గర నిర్మిస్తున్న భవనాలు
''భాగవతాన్ని తెలుగులోకి అనువాదం చేసి, తెలంగాణ భాషామృతాన్ని పంచిన సహజ కవి, సాహితీ తేజోమూర్తి బమ్మెర పోతనామాత్యులు. ఆయన విరచించిన సాహితీశోభ తెలుగు సాహితీ చరిత్రలో అజరామరమై వెలిగిపోతుంది. 'బాల రసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్' అంటూ తన కావ్యాన్ని రాజులకు కాకుండా భగవంతుడైన శ్రీరామునికే అంకితమిచ్చి, కవి ఆత్మగౌరవాన్ని చాటిన తెలంగాణ ప్రజాకవి'' అని బమ్మెర పోతనను ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు.