వరంగల్ జిల్లాలో భారీ దొంగతనం జరిగింది. రాయపర్తి మండలంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్రాంచ్‌లో దుండగులు అర్థరాత్రి 14.94 కోట్ల రూపాయల విలువైన సుమారు 19 కిలోల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. దాదాపు 500 మంది ఖాతాదారులకు చెందిన బంగారాన్ని దొంగలు దోచుకున్నారు. సెక్యూరిటీ గార్డు లేకపోవడంతో దొంగలు ఎంతో సులువుగా బ్యాంకులోకి ప్రవేశించారు. కిటికీ ఇనుప గ్రిల్‌ను తొలగించారు. కొన్ని వైర్లను కత్తిరించడం ద్వారా CCTV కెమెరాలను ఆపేశారు. అంతేకాకుండా హార్డ్ డిస్క్ ను కూడా దొంగిలించారు. గ్యాస్ కట్టర్‌ను ఉపయోగించి, దొంగలు బ్యాంకుకు చెందిన మూడు కస్టమర్ సేఫ్టీ లాకర్లలోని బంగారు ఆభరణాలు ఉన్న ప్యాకెట్లను బయటకు తీసేశారు. దుండగులు తప్పించుకునే ముందు గ్యాస్ కట్టర్‌ను ఘటనా స్థలంలో వదిలేశారు.
దొంగతనాన్ని గమనించిన బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. వర్ధన్నపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, సీనియర్ ఇన్‌స్పెక్టర్లు శ్రావణ్ కుమార్, రాజు తదితర అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దోపిడీ వార్త బ్యాంకు ఖాతాదారులలో భయాందోళనలకు గురిచేసింది. చాలా మంది బ్యాంకుకు చేరుకున్నారు. మీ వస్తువులు మీకు అందేలా చర్యలు తీసుకుంటామని బ్యాంకు అధికారులు ఖాతా దారులకు హామీ ఇచ్చారు. ఈ బ్రాంచ్ లో రెండు సంవత్సరాల క్రితం దోపిడీ ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత ఒక ప్రైవేట్ సెక్యూరిటీ గార్డును నియమించారు, కానీ గత ఏడాది కాలంగా ఆ స్థానం ఖాళీగా ఉంది.