ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ మౌలిక వసతుల కల్పన, నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని అమలు చేస్తోందని పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. మన ఊరు-మన బడి కార్యక్రమం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సంబంధిత అధికారులను హెచ్చరించారు. ప్రజాప్రతినిధులతో కలిసి వరంగల్, హన్మకొండ జిల్లాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో దయాకర్‌రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు.
మండలాన్ని యూనిట్‌గా పరిగణించి మూడింట ఒక వంతు పాఠశాలలు ఈ పథకానికి ఎంపికయ్యాయని, హన్మకొండలోని 84 ప్రాథమిక, 18 ప్రాథమికోన్నత, 74 ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 492 పాఠశాలలకు గాను 176 పాఠశాలలు ఎంపికయ్యాయని ఆయన తెలిపారు. ''వరంగల్ జిల్లాలో మొత్తం 645 పాఠశాలలు ఉండగా, ఈ కార్యక్రమానికి 223 పాఠశాలలు ఎంపికయ్యాయి. వాటిలో 123 ప్రాథమిక, 20 ప్రాథమికోన్నత, 80 ఉన్నత పాఠశాలలు ఉన్నాయన్నిరు. "ఈ కార్యక్రమం కింద.. ప్రతి పాఠశాలకు నిరంతర నీటి సరఫరా, మరుగుదొడ్లు, విద్యుత్, తాగునీరు, ఫర్నిచర్, కాంపౌండ్ వాల్స్, కిచెన్ షెడ్లు, అదనపు తరగతి గదులు, డిజిటల్ లైబ్రరీలతో పాటు మరమ్మతులు చేపట్టడం జరుగుతుంది. పాత భవనాలను పునరుద్ధరిస్తామని మంత్రి తెలిపారు.