విజయగర్జన సభ కోసం స్థల పరిశీలన
Minister inspecting Vijaya Garjana Sabha Venue.తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీ స్థాపించి 20 వసంతాలు
By తోట వంశీ కుమార్ Published on 30 Oct 2021 4:32 PM IST
తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీ స్థాపించి 20 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించిననున్న విజయ గర్జన సభ కోసం రాంపూర్ సమీపంలోని స్థలాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ శనివారం పరిశీలించారు. నవంబర్ 15న విజయ గర్జన సభను నిర్వహించనున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 10లక్షల మందితో సభను విజయవంతం చేసేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు నాయకులు సన్నాహాకాలు చేస్తున్నారు.
సభ ఎక్కడ నిర్వహించాలన్న దానిపై ఇప్పటికే నగరంలో మడికొండ, ఉనికిచర్ల, ఉర్సు రంగలీలా మైదానం సమీపంలోని పలు ప్రాంతాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పరిశీలించగా.. తాజాగా వినోద్ కుమార్‌తో కలిసి రాంపూర్ సమీపంలోని స్థలాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్న రైతులతో మాట్లాడారు. 10లక్షల మందితో నిర్వహించే సభ కాబట్టి ఎవ్వరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని రకాలుగా అనువైన స్థలం కోసం అన్వేషిస్తున్నారు.
ఇక పార్టీ ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, మండల, గ్రామ, వార్డు పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ అనుబంధ సంఘాల బాధ్యులు సహా నియోజకవర్గంలోని ముఖ్యనేతలు సమావేశమై విజయగర్జన సభను విజయవంతం చేయడంపై ఇప్పటికే చర్చించారు. సభకు తరలివచ్చే సాధారణ ప్రజలకు వాహన సౌకర్యం కల్పించడంతోపాటు ఇతర అన్ని అంశాలపై సమాలోచనలు చేశారు.