మేడారం జాతర విజయవంతం.. మంత్రులు ఎర్రబెల్లి, అల్లోల
Medaram Jathara is succes says Ministers errabelli and allola.అందరి సహాయ సహకారాలతో మేడారం సమ్మక్క-సారలమ్మ
By తోట వంశీ కుమార్ Published on 19 Feb 2022 9:55 AM GMTఅందరి సహాయ సహకారాలతో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర విజయవంతంగా నిర్వహించగలిగామని దేవాదాయ శాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. జాతరను విజయవంతం చేసిన అధికారులను మంత్రులు సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఉన్నతాధికారులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించడంతో జాతర సజావుగా జరిగిందన్నారు.
జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారన్నారు. అమ్మవార్ల దయతో భక్తులు మొక్కులు చెల్లించుకుని సంతోషంగా తిరిగి వెళ్లారని వెల్లడించారు. గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ క్షేత్రస్థాయిలో పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారన్నారు. సీఎం కేసీఆర్ గతంలో ఎన్నడూ లేని విధంగా జాతరకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారన్నారు. మొత్తం రూ.75 కోట్లు మంజూరు చేశారన్నారు. నాలుగు జాతరలకు కలిపి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.332.71 వెచ్చించిందని చెప్పారు. నిధులతో శాశ్వత నిర్మాణాలు చేపట్టామని, మౌలిక వసతుల కొరత తీరిందన్నారు. సకాలంలో నిధులు విడుదల చేయడంతో పనులు త్వరితగతిన పూర్తి చేయడం జరిగిందని మంత్రి చెప్పారు. అన్ని శాఖల మధ్య సమన్వయంతో ఏర్పాట్లు చేయడంతో భక్తులకు ఎంతో సౌకర్యం కలిగిందని తెలిపారు. దాదాపు కోటి 30 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని చెప్పారు.
దేవాదాయ శాఖ మంత్రిగా వరుసగా నాలుగు జాతరలను పర్యవేక్షించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, వ్యక్తిగతంగా ఎంతో సంతృప్తినిచ్చిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. వనదేవతల చల్లని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఈ సందర్భంగా కోరుకున్నారు. ఇక జాతరకు ఏమీ చేయకుండా ఇక్కవకు వచ్చి అమ్మవార్ల చెంత రాజకీయ విమర్శలు ఏంటని బీజేపీ నాయకులను మంత్రి ప్రశ్నించారు. కుంభమేళాకు రూ.325 కోట్లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అతి పెద్ద ఆదివాసీ జాతరకు కేవలం రూ.2.5 కోట్లు ఇవ్వడం ఏంటని నిలదీశారు. గిరిజనులంటే చులకన వల్లే ప్రధాని మోదీ, అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు మేడారానికి రావడం లేదని విమర్శించారు.