తీవ్ర పరిణామాలుంటాయ్‌ : ఎమ్మెల్యేకు కొండా సురేఖ హెచ్చ‌రిక‌

Kondas warn Parkal MLA. పరకాల రాజ‌కీయం ఒక్క‌సారిగా హీటెక్కింది. హనుమకొండ జిల్లా ఆత్మకూర్ మండల

By Medi Samrat  Published on  23 Jan 2022 4:34 AM GMT
తీవ్ర పరిణామాలుంటాయ్‌ : ఎమ్మెల్యేకు కొండా సురేఖ హెచ్చ‌రిక‌

పరకాల రాజ‌కీయం ఒక్క‌సారిగా హీటెక్కింది. హనుమకొండ జిల్లా ఆత్మకూర్ మండల పరిధిలోని ఆగ్రాం పహాడ్‌లోని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తల్లిదండ్రుల స్మారక చిహ్నాన్ని శనివారం టీఆర్‌ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేసిన ఘటనలో రాజకీయ దుమారం రేగుతోంది. ఆగ్రాం పహాడ్ జాతరకు వచ్చే భక్తులకు అడ్డంకిగా ఉందని.. స్మారక చిహ్నాన్ని కూల్చివేయాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తన కార్యకర్తలకు చెప్పినట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. కొండా చెన్నమ్మ, కొమురయ్య స్మారక స్థూపాన్ని కొండా సురేఖ 2010లో పరకాల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిర్మించారని.. ఆమె కుమార్తె సుస్మిత.. స్మారక స్థూపం కోసం భూమిని విరాళంగా ఇచ్చారని చెబుతారు.

స్మారక చిహ్నా ధ్వంసం చేశార‌న్న‌ సమాచారం అందుకున్న కొండా సురేఖ, సుస్మిత ఆగ్రాం పహాడ్‌ను సందర్శించారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడిన కొండా సురేఖ.. చల్లా ధర్మారెడ్డిపై తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ధర్మారెడ్డికి ఏ హక్కు ఉంది. ఈ స్మారకాన్ని తమ సొంత స్థలంలో నిర్మించుకున్నామని సురేఖ తెలిపారు. గతంలో కూడా ధర్మారెడ్డి కూల్చివేసేందుకు ప్రయత్నించారని.. అయితే అలా చేయవద్దని అప్పటి కలెక్టర్ వాకాటి కరుణ హెచ్చరించారని ఆమె గుర్తుచేశారు. ధర్మారెడ్డి క్షమాపణలు చెప్పడంతో పాటు.. స్మారక చిహ్నాన్ని పునరుద్ధరించాలని సుస్మిత డిమాండ్ చేశారు. పెద్ద సంఖ్యలో కొండా అనుచరులు ధర్మారెడ్డికి, టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.




Next Story