వికటించిన రాత్రి భోజనం.. 34 మంది విద్యార్థినులకు అస్వస్థత.. ఒకరి పరిస్థితి విషమం..!
Food Poison in Wardhannapet girls hostel. రాత్రి భోజనం వికటించి 34 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైయ్యారు.
By తోట వంశీ కుమార్ Published on 6 Sep 2022 4:54 AM GMTప్రభుత్వ గురుకుల పాఠశాలల పరిస్థితి అధ్వానంగా మారుతోంది. విద్యార్థుల బాగోగులు చూడాల్సిన అధికారులు, హాస్టల్‌వార్డెన్లు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. వీరిని పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు సైతం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల వసతి గృహాల్లో పుడ్ పాయిజన్ ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా సోమవారం రాత్రి వరంగల్ జిల్లా వర్ధన్న పేట ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో రాత్రి భోజనం వికటించి 34 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైయ్యారు.
గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 5 నుంచి 10వ తరగతి వరకు సుమారు 200 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. రోజులాగానే సోమవారం కూడా రాత్రి 7.30 గంటలకు భోజనాన్ని వడ్డించారు. ఓ విద్యార్థినికి పళ్లెంలో చనిపోయిన బల్లి కనిపించింది. వెంటనే విషయాన్ని అక్కడి సిబ్బందికి తెలియజేసింది. వారు అప్రమత్తమై భోజనం చేయకుండా ఆపారు. అయితే.. అప్పటికే కొంత మంది విద్యార్థులు భోజనం చేశారు.
కాసేపటికి కొందరు విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైయ్యారు. వసతి గృహం సిబ్బంది వెంటనే విద్యార్థినులను వర్థనపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో 13 మంది విద్యార్థినులకు మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కాగా.. వీరిలో ఓ విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే పరామర్శ..
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అరూరి రమేశ్ విద్యార్థినులు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లారు. విద్యార్థినులను పరామర్శించారు. అక్కడి వైద్యులను అడిగి వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అనంతరం వసతి గృహాన్ని సందర్శించి భోజనశాల, వంట గదిని పరిశీలించారు.