ఫలించిన రైతుల పోరాటం.. ల్యాండ్ పూలింగ్ జీఓను రద్దు చేసిన‌ ప్రభుత్వం

Farmers protest bends govt to scrap land pooling GO. వరంగల్‌లోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ల్యాండ్‌పూలింగ్‌

By Medi Samrat  Published on  31 May 2022 3:28 PM IST
ఫలించిన రైతుల పోరాటం.. ల్యాండ్ పూలింగ్ జీఓను రద్దు చేసిన‌ ప్రభుత్వం

వరంగల్‌లోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ల్యాండ్‌పూలింగ్‌ ప్రక్రియను రద్దు చేసింది. రైతుల నిరసనల నేపథ్యంలో ఈ ప్ర‌క్రియకు నిలిపివేసింది. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ నగరం చుట్టుపక్కల 28 గ్రామాల్లో భూసేకరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా రైతుల నిరసనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది.

ల్యాండ్ పూలింగ్‌కు భూ యజమానుల సమ్మతిని కోరుతూ ఏప్రిల్ 30న జారీ చేసిన నోటిఫికేషన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా)ని ప్రభుత్వం ఆదేశించినట్లు చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ తెలిపారు.

41 కిలోమీటర్ల మేర ఓఆర్‌ఆర్‌ను అభివృద్ధి చేయాలని కుడా ప్రతిపాదించింది. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ద్వారా దీనిని చేపట్టింది. హన్మకొండ, వరంగల్, జనగాం మూడు జిల్లాల్లోని 28 గ్రామాల పరిధిలో సర్వే పనులను ప్రారంభించింది. ఈ స‌మ‌యంలోనే నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేప‌ట్టారు. భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడేందుకు జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. గత వారం రైతులు వరంగల్-హైదరాబాద్ హైవేపై రాస్తారోకో చేయడంతో కొన్ని గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ నిరసనకు కాంగ్రెస్, వామపక్షాలు, బీజేపీ మద్దతు తెలిపాయి.

ఓఆర్‌ఆర్ కోసం 28 గ్రామాల్లోని 21,510 ఎకరాల భూమిని సేకరించాలని కుడా ప్రతిపాదించింది. రైతుల నుంచి వస్తున్న వ్యతిరేకత దృష్ట్యా ఈ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు కుడా ప్రకటించినప్పటికీ.. ప్రభుత్వం ఈ చర్యను ఉపసంహరించుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామని రైతు జేఏసీ స్పష్టం చేసింది.

వర్ధన్నపేటకు చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) అధికార ఎమ్మెల్యే అరూరి రమేష్, మంత్రి కేటీఆర్‌ రైతుల నిరసన నేపథ్యంలో ఈ అంశంపై చర్చించారు.

















Next Story