వనదేవతలను నేడు దర్శించుకోనున్న సీఎం కేసీఆర్
Chief Minister KCR to Visit Medaram with Family Today.ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు(శుక్రవారం) మేడారంలో
By తోట వంశీ కుమార్ Published on 18 Feb 2022 7:58 AM ISTముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు(శుక్రవారం) మేడారంలో పర్యటించనున్నారు. మేడారం మహాజాతరలో పాల్గొని సమ్మక్క–సారమ్మలను దర్శించుకోనున్నారు. అనంతరం మొక్కులు చెల్లించనున్నారు. హైదరాబాద్ నుంచి సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో మేడారానికి చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు మేడారం చేరుకోనున్న సీఎం మధ్యాహ్నాం 3 గంటల వరకు అక్కడే ఉండనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపధ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం వెంట ప్రభుత్వ సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి కూడా రానున్నారు.
ఇదిలా ఉంటే.. మేడారం మొత్తం సమ్మక్క నామస్మరణతో మార్మోగింది. జాతరలో అతి ముఖ్యమైన ఘట్టం గురువారం రాత్రి ఆవిష్కృతమైంది. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు జయజయధ్వానాలతో స్వాగతం పలుకుతుండగా.. గిరిజన యువతుల నృత్యాలు, కోయ దొరల డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, అధికారుల లాంఛనాల మధ్య ఆదివాసీ పూజారులు, వడ్డెలు వన దేవత సమ్మక్క ను మేడారం గద్దెలపైకి చేర్చారు. గురువారం రాత్రి 9.16 గంటలకు సమ్మక్క తల్లిని పూజారులు గద్దెపై ప్రతిష్టించారు. బుధవారం చిన్నమ్మ సారలమ్మ, తండ్రి పగిడిద్దరాజు, భర్త గోవిందరాజు గద్దెలపై కొలువుతీరగా.. గురువారం సమ్మక్క సైతం విచ్చేయడంతో మేడారం జాతరకు పరిపూర్ణ శోభవచ్చింది.
వనదేవతలను దర్శించుకోనేందుకు భక్తులు పోటెత్తారు. శుక్రవారం నిండు జాతర ఉంటుంది. శనివారం వరకు జాతర కొనసాగనుంది. రేపు సమ్మక్క సారలమ్మ దేవతల వనప్రవేశంతో జాతర ముగియనుంది.