వరంగల్ హత్యలు: 9 కాదు.. 10 హత్యలు..ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలను వివరించిన సీపీ
By సుభాష్ Published on 25 May 2020 12:10 PM GMTవరంగల్‌లోని గొర్రెకుంటలో 9 మంది హత్యలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు వరంగల్ సీపీ వెల్లడిస్తూ నిందితుడు సంజయ్‌ని మీడియా ముందు ప్రవేశపెట్టాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈనెల 21న బావిలో గొర్రెకుంట బావిలో మృతదేహాలు ఉన్నాయంటూ తమకు సమాచారం అందడంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించామని అన్నారు. 21న బావిలో నాలుగు మృతదేహాలను గుర్తించగా, 22న మరో ఐదు మృతదేహాలను గుర్తించినట్లు చెప్పారు. ఈ కేసు విషయంలో మొత్తం ఆరు పోలీసు బృందాలు రంగంలోకి దిగి విచారణ చేపట్టామని తెలిపారు. నిందితుడు సంజయ్ ఆరేళ్ల క్రితం వరంగల్‌కు వసల వచ్చాడని, మక్సూద్ పని చేస్తున్న గోనెసంచుల కేంద్రంలో సంజయ్ కూడా పని చేశాడని, ఇక అదే ఫ్యాక్టరీలో పని చేస్తున్న మక్సూద్ కుటుంబంతో సంజయ్ పరిచయం ఏర్పడిందన్నారు. అయితే కేసు దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగు చూశాయి. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తును ముమ్మరం చేసి మిస్టరీని ఛేధించారు. ఒక హత్య నుంచి తప్పించుకోవడానికి 9 మందిని హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకొన్నట్లు తెలిపారు.
వరంగల్ కమిషనరేట్ పరిధిలోని గీసుకొండ మండలం గొర్రెల కుంట బావిలో జరిగిన ఈ దుర్గటన అందరిని కలచివేసిందని, 9 శవాలను గిన్నీ గోడౌన్ పక్కననున్న బావి నుంచి మృతదేహాలను బయటకు తీశారు. గోడౌన్ యజమాని ఫిర్యాదు మేరకు మే 21న కేసు నమోదు చేశాం. ఆ బావిలో నుంచి ముందుగా నాలుగు మృతదేహాలను బయటకు తీశాం. తర్వాత అంటే 22న మక్సూద్, ఆయన భార్య, కుమార్తె, మనవడి శవాలను బయటకు తీశాం అని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు.
అయితే కమిషనరేట్ పరిధిలో ఆరు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టాం. పకడ్బందీగా పని చేసి కేసు మిస్టరీని ఛేదించాం అని అన్నారు.
మక్సూద్ కుటుంబంలో మొత్తం ఆరుగురు. ఆయన, భార్య గోనె సంచుల ఫ్యాక్టరీలో పని చేస్తారు. ఇక అదే ఫ్యాక్టరీలో పని చేస్తున్న సంజయ్ అనే వ్యక్తం మక్సూద్ కుటుంబానికి పరిచయం అయ్యాడు. నిషా అలం అక్క కూతురు రఫికా (37) ఐదేళ్ల క్రితం పశ్చిమబెంగాల్ నుంచి ముగ్గురు పిల్లలను తీసుకుని వరంగల్ కు వచ్చినట్లు తెలిపారు. ఆమె కూడా మక్సూద్ సాయంతో అదే గోనె సంచి ఫ్యాక్టరీలో పని చేసింది. నిందితుడు సంజయ్ కూడా అక్కడే ఉండేవాడు. అతడికి రఫీకా భోజనం వండి పెడుతూ డబ్బులు తీసుకునేది. అలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం సాన్నిహిత్యానికి దారి తీసింది. తర్వాత సహజీవనం ప్రారంభించారు.
ఈ రఫీకా కూతురు యుక్త వయస్కురాలు. ఆ అమ్మాయితో సంజయ్ పరిచయం పెంచుకునేందుకు ప్రయత్నించగా, రఫీకా మందలించింది. నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి రఫీకాను బెంగాల్‌కు తీసుకెళ్లి గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో వరంగల్ నుంచి మార్చి 7న బయలుదేరారు. పక్కా ప్లాన్‌తో మజ్జిగ ప్యాకెట్లో నిద్రమాత్రలు వేసి రఫీకాకు ఇచ్చాడని, ఆమె పడుకున్న తర్వాత వేకువజామున 3 గంటల ప్రాంతంలో చున్నీతో మెడకు బిగించి చనిపోయాక రైళ్లో నుంచి బయతకు తోసేశాడని నిందితుడు సంజయ్ అంగీకరించినట్లు సీపీ తెలిపారు. అనంతరం రాజమండ్రిలో రైలు దిగి ఇంటికొచ్చాడు. నిండదవోలు మండలం ప్రాంతంలో బాడీనీ గుర్తించారు. తాడేపల్లి గూడెం పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు.
కాగా, మక్సూద్ కూతురు తన సోదరి ఎక్కడుందని ఆడగడం మొదలు పెట్టింది. తన గురించి చెప్పకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదించారు. ఆమెను హత్య చేసిన విషయం బయటపడుతుందనే ఉద్దేశంతో వారిని హతమార్చాలని భావించాడు. మే 16 నుంచి 21 వరకూ తరచూ పని చేస్తున్న ఫ్యాక్టరీ వద్ద వెళ్లేవాడు. మక్సూద్ పెద్ద కొడుకు పుట్టిన రోజు ప్లాన్ వేసుకుని మే 18న హన్మకొండలో నిద్రమాత్రలు కొనుగోలు చేశాడు. మే 20న అక్కడికెళ్లి సమయం చూసుకుని నిద్రమాత్రలను తినే ఆహారంలో కలినట్లు సీపీ తెలిపారు.
ఇక మక్సూద్ కుటుంబంలో ఆరుగురితో పాటు అనుమానం వస్తుందనే ఉద్దేశంతో బీహార్‌కు చెందిన శ్రీరామ్, శ్యామ్ అనే ఇద్దరికి కూడా వాళ్లు తినే ఆహారంలో నిద్రమాత్రలు పొడి చేసి కలిపాడు. షకీల్ అనే వ్యక్తి కూడా అక్కడే ఉండగా, మొత్తం 9 మంది కూడా నిద్రమాత్రల వల్ల మత్తులోకి జారుకున్నారు. అదే సమయం చూసుకుని ఒక్కొక్కరిని గోనె సంచిపై పెట్టి అక్కడే అందరిని బావిలో పడేశాడు. ఇక పై అంతస్తులో ఉన్న ఇద్దరు బీహార్‌కు చెందిన యువకులను కూడా బావిలో తోసేశాడు. అర్థరాత్రి 12 గంటల నుంచి తెల్లవారు జాము 5 గంటల వరకూ వీరందరిని బావిలో పడేయడం పని పూర్త చేసినట్లు ఆయన తెలిపారు.
షకీల్ పర్సు, ఇతర వస్తువులను తీసుకుని ఉదయాన్నే సైకిల్ మీద తన ఇంటికి వెళ్లాడు. రఫీకా హత్యను కప్పి పుచ్చుకునేందుకు మక్సూద్ కుటుంబంలోని ఆరుగురితో పాటు మరో ముగ్గురిని కూడా సంజయ్ కుమార్ హతమార్చినట్లు చెప్పారు. ఈ కేసులో సీసీ పుటేజీ పక్కా ఆధారాలుగా మారినట్లు చెప్పారు. అన్ని విధాలుగా దర్యాప్తు చేసి నిందితుడు సంజయ్‌ని అరెస్టు చేశామని తెలిపారు. ఒక హత్యను కప్పిపుచ్చుకోవడానికి ఇలా 9 మందిని హతమార్చాడు సంజయ్. ఇక చిన్న చిన్న ఆధారాలను సేకరించి ఛార్జీషీట్ నమోదు చేసి కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు.ఈ కేసులు 72 గంటల్లోనే ఛేదించామని తెలిపారు.