మహారాష్ట్ర-హర్యానా ఎన్నికల్లో కనిపించని ఓటరు చైతన్యం...!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Oct 2019 5:36 PM GMT
మహారాష్ట్ర-హర్యానా ఎన్నికల్లో కనిపించని ఓటరు చైతన్యం...!

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమరం ప్రశాంతంగా ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా పెద్దగా అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకో లేదు. రెండు రాష్ట్రాల్లోనూ ఓటర్లలో ఉత్సాహం అంతగా కనిపించలేదు. హర్యానాలో మోస్తరు స్థాయిలో పోలింగ్ నమోదైతే, మహారాష్ట్రలో ఓటర్ల తీరు తీవ్రంగా నిరాశపరిచింది. పట్టణ ప్రాంతాల ఓటర్లు మరీ బద్దకస్తుల్లా తయారయ్యారు. ప్రజలు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో పోలింగ్ కేంద్రాల వద్ద సందడి తక్కువగా కనిపించింది.

మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. బీజేపీ-శివసేన కూటమి, కాంగ్రెస్-ఎన్సీపీ కూటములు హోరాహోరీగా తలపడ్డాయి. ప్రచారం నువ్వా నేనా అన్నట్లుగా సాగినప్పటికీ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా చేయడంలో పార్టీలు విఫలమయ్యాయి. ఉదయం నుంచే పోలింగ్ మందకొడిగా ప్రారం భమైంది. మధ్యాహ్నం వరకు ఓటింగ్ పెద్దగా ఊపందుకోలేదు. ఒంటి గంట వరకు పోలింగ్ 30 శాతం కూడా నమోదు కాలేదు. మధ్యాహ్నం తర్వాత కాస్త ఊపు వచ్చింది. ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యంగా గ్రామాలు, పల్లె ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు కిటకిటలాడాయి. దాంతో పోలింగ్ 50శాతం మార్క్‌ దాటింది.

మహా పోలింగ్‌లో పలు చోట్ల ఈవీఎంలలో సమస్యలు తలెత్తాయి. రత్నగిరి, భండారా జిల్లాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైం ది. వర్లీ ప్రాంతంలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలో సాంకేతికలోపం తలెత్తడంతో ఓటింగ్‌ను కొంతసేపు నిలిపివేశారు. ఈవీఎంల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లా పరిధిలోని చాలా గ్రామాల్లో ఒక్క ఓటరు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. వాద్వాన్ పోర్టు నిర్మాణంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తామని ప్రకటించారు. అన్నట్లుగానే 10 గ్రామాలకు చెందిన ఓటర్లు పోలింగుకు దూరంగా ఉన్నారు.ఇక, ముంబై, నాగపూర్, పుణే, థానే తదితర పట్టణాల్లో ఓటర్లు బద్దకించారు. మెజార్టీ ప్రజలు పోలింగ్‌ కేంద్రాల దరిదాపుల్లోకి కూడా రాలేదు. దాంతో పోలింగ్ శాతం దారుణంగా పడిపోయింది.

హర్యానాలో కూడా అంతంత మాత్రమే..!

హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. బీజేపీ, కాంగ్రెస్, చౌతాల పార్టీల మధ్య త్రిముఖ పోటీ జరిగింది. మహారాష్ట్రతో పోల్చితే హర్యానా కాస్త మెరుగు. ఇక్కడ ఓటర్లు ఓటు వేయడానికి కొద్దిగా ఉత్సాహం చూపించారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద సందడి కనిపించింది. గ్రామీణ ప్రాంతా ల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరారు. వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అసెంబ్లీ ఎన్నికల వేళ హర్యానాలో ఘర్షణలు జరిగాయి. మేవట్‌లో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకున్నారు. పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘర్షణలో ఆరుగురు గాయపడ్డారు. మహారాష్ట్రలోనూ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. స్వాభిమాని పక్ష పార్టీకి చెందిన దేవేంద్ర భుయార్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆయన కారులో వస్తుండగా అడ్డగించిన దుండగులు ఆయన్ను కారు నుంచి దింపి దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భుయార్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

మహారాష్ట్ర-హర్యానా అసెంబ్లీ ఎన్నికలతో పాటు 16 రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ, 2 లోక్‌సభ నియోజకవర్గాలకు కూడా ఉప ఎన్నికలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌ లో 11, గుజరాత్‌లో 6 స్థానాలకు బై ఎలక్షన్స్ జరిగాయి. బిహార్, కేరళల్లో ఐదేసి స్థానాలు, పంజాబ్, అసోంలో నాలుగేసి సీట్లకు ఓటింగ్ జరిగింది. సిక్కింలో 3 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించారు. హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడుల్లో రెండేసి సీట్లు, అరుణాచల్‌ప్రదేశ్‌, మేఘాలయ, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, ఒడిశా, తెలంగాణ, పుదుచ్చేరిలో ఒక్కో అసెంబ్లీ స్థానానికి, బిహార్, మహారాష్ట్రల్లో ఒక్కో లోక్‌సభకు పోలింగ్ జరిగింది.

Next Story