వివేకా హత్య కేసులో విచారణ వేగం...ఇంకా తేలని అసలైన నిందితులు

By Newsmeter.Network  Published on  8 Dec 2019 6:41 AM GMT
వివేకా హత్య కేసులో విచారణ వేగం...ఇంకా తేలని అసలైన నిందితులు

ముఖ్యాంశాలు

  • ఇప్పటి వరకు 1300 మందిని విచారించిన సిట్
  • ఇంకా బయటపడని అసలైన నిందితులు
  • అనుమానితులపై సిట్ ప్రశ్నల వర్షం

ఏపీలో వైఎస్ వివేకా హత్యకేసుపై సిట్ విచారణ కొనసాగుతోంది. నేడో, రేపో వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిట్ విచారణకు హాజరుకానున్నారు. అలాగే సోమవారం మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ బీటెక్ రవి, నారాయణ రెడ్డిలను సిట్‌ విచారించింది.

ఇప్పటికే సిట్ 1300 మందిని అనుమానితులను విచారించినా...ఈ కేసులో అసలైన నిందితులు ఎవరనేది ఇంకా తేలలేదు. ఈ కేసులో అవినాష్ ప్రధాన సాక్షిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి చెప్పే సాక్ష్యం కూడా కీలకంగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో పులివెందులలో ఒక సారి ఆయన్ని సిట్ విచారించిన విషయం తెలిసిందే. ముందు వివేకాకు గుండెపోటని ఎందుకు చెప్పారు..? ఆ తర్వాత హత్య జరిగిందని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటూ సీట్‌ ప్రశ్నల వర్షం కురిపించింది. అంతేకాకుండా ఈ కేసులో డబ్బుకు సంబంధించిన లావాదేవీలు కూడా జరిగినట్టు అనుమానాలున్నాయి. అదే ప్రధానంగా విచారించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా హత్య జరిగి ఇప్పటికి 8 నెలలు కావస్తున్న కేసు మాత్రం ముందుకు సాగడం లేదనే విమర్శలున్నాయి.

2019 ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ముందు గుండెపోటు అని భావించినా.. పోస్ట్ మార్డం రిపోర్టులో అది హత్యగా తేలింది. హత్య జరిగినప్పుడు అప్పటి టీడీపీ సర్కార్‌ విచారణ కోసం సిట్‌ బృందం ఏర్పాటు చేసింది. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో సిట్‌ బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ కొనసాగిస్తోంది. వివేకా హత్య కేసులో ప్రధాన అనుమానితులైన ప్రకాష్, శ్రీనివాస్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి ముగ్గురూ బెయిల్‌పై విడుదల అయ్యారు. కాగా.. వీరిలో శ్రీనివాస్ రెడ్డి అనే అతను ఆత్మహత్య చేసుకుని మరణించాడు. హత్య జరిగిన తర్వాత విచారణ వేగవంతం కొనసాగి వెనుకబడింది. కాగా, సీఎం జగన్‌ ఆదేశాల మేరకు గత పది రోజుల నుంచి విచారణ వేగవంతం చేశారు.

Next Story
Share it