ముఖ్యాంశాలు

  • కొండవీటి చాంతాడులా కొనసాగుతున్న దర్యాప్తు
  • గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తేల్చలేదు
  • ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కూడా తేల్చలేదు
  • కాలం గడిచిన కొద్దీ మరుగున పడిపోయే ప్రమాదం
  • ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు

“అసలేం జరిగింది? ఇప్పటికీ ఇది వివేకా హత్యకేసులో ఇది సమాధానం లేని ప్రశ్న. హత్య జరిగిన తీరుపై పలు సందేహాలు. అత్యంత క్రూరంగా వివేకాను హింసించి చంపారన్నది మాత్రం వాస్తవమని ఆయన భార్య, కూతురు వెల్లడిచేసిన అంశాలనుబట్టి, మీడియాలో వచ్చిన వార్తల్ని బట్టి సామాన్యులకు అర్థమయ్యింది. కానీ ఎందుకు? అన్న ప్రశ్నకు కూడా సమాధానం లేదు. రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరొందిన వివేకాని ప్రత్యర్థిపార్టీల నేతలు, కార్యకర్తలు సైతం గౌరవిస్తారు. అందరినీ కలుపుకుపోయే మనస్తత్త్వం వై.ఎస్.వివేకానందరెడ్డిది. సాధారణ ప్రజానీకానికి తెలిసినంతవరకూ ఆయన్ని అంత దారుణంగా, హింసించి చంపాల్సిన అవసరం ఎవరికీ ఉండడానికి వీల్లేదు. కానీ అదే స్థాయిలో హత్య జరిగిందన్న విషయం పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా వెలుగుచూసిన నిజం.

బెడ్రూమ్ దొడ్డి తలుపు తీసుండడమేంటి? పదునైన ఆయుధంతో వివేకాను హంతకులు గాయపరచడం ఏంటి. తల వెనక భాగంలో, నుదుటి భాగంలో, మణికట్టుమీద పదునైన ఆయుధంతో కొట్టినట్టుగా, కోసినట్టుగా తీవ్రమైన గాయలు ఉండడం ఏంటి? అసలు హంతకులు లోపలికి ఎలా ప్రవేశించగలిగారు? ఇందులో ఇంటిదొంగల పాత్రేమైనా ఉందా? ఇవన్నీ ఇప్పటికి ఈశ్వరుడికి మాత్రమే ఎరుక. అసలు అది హత్య అని స్పష్టంగా తెలిసిన తర్వాతకూడా సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఉన్నవాళ్లు ఎందుకు మృతదేహంపై ఉన్న గాయాల్ని శుభ్రం చేశారు? వాటినుంచి తీవ్రంగా కారుతున్న రక్తాన్ని ఎందుకు శుభ్రం చేయాల్సొచ్చింది? మృతదేహాన్ని బాత్రూమ్ నుంచి బైటికి ఎందుకు తీసుకురావొల్సొచ్చింది? ఎందుకు బ్యాండేజ్ కట్టాల్సొచ్చింది? ఎందుకు బెడ్ షీట్ లో చుట్టి బెడ్ రూమ్ లో నేలమీద పెట్టాల్సొచ్చింది?

అసలు అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే బెడ్ రూమ్ లో ఉన్న రక్తపు మడుగును, రక్తపు మరకల్నీ, బాత్రూమ్ లో ఉన్న రక్తపు మరకల్నీ ఎందుకు కడగడం, తుడవడం చేశారు? హత్య జరిగిన ప్రదేశంలో క్లూస్ టీమ్ కి సరైన సాక్ష్యాలు దొరకాలంటే పోలీసులు వచ్చేవరకూ సీన్ ఆఫ్ అఫెన్స్ లో దేన్నీ ముట్టుకోకుండా ఉండడం చాలా అవసరం. అలా ముట్టుకోవడం నేరంకూడా. కానీ వివేకా మృతదేహాన్ని బాత్రూమ్ నుంచి బైటికి తీసుకొచ్చారు. గాయాలను శుభ్రం చేశారు. బెడ్ షీట్ లో చుట్టారు. రక్తపు మరకల్ని శుభ్రం చేశారు. అసలు ఇవన్నీ ఎందుకు చేయాల్సొచ్చినట్టు..? “ వివేకా కూతురు డాక్టర్ సునీత మదిలో మెదులుతున్న ప్రశ్నలివి. అందుకే ఆమె సమగ్రమైన విచారణకు, సిబిఐ విచారణకు ముందునుంచీ పట్టుబడుతూనే ఉన్నారు.

అంతుచిక్కని సాక్ష్యాలు, ఆధారాలు, వివరాలు

తుమ్మలపల్లి గంగిరెడ్డి అలియాస్ ఎర్రా గంగిరెడ్డి, మూలి వెంకట కృష్ణారెడ్డి, ఎద్దుల ప్రకాష్ లను బెస్తవారిపల్లి వై.జంక్షన్ దగ్గర అరెస్ట్ చేసిన పోలీసులు మార్చ్ 28వ తేదీ, 2019న కోర్టులో ప్రవేశపెట్టారు. సాక్ష్యాలను రూపుమాపడం ద్వారా అసలు నేరస్థులకు వీళ్ల ముగ్గురూ పూర్తి స్థాయి సహకారాన్ని అందించారన్న అభియోగం మేరకు వీళ్లపై కేసు నమోదయ్యింది. 90 రోజుల తర్వాత వీళ్లందరికీ కండిషనల్ బెయిల్ మంజూరయ్యింది. కానీ ఇప్పటివరకూ వివేకా హత్య కేసు విచారణలో పెద్దగా పురోగతి కనిపించలేదనే చెప్పాలి. అందుకే వివేకానందరెడ్డి కుమార్తె సునీత సిబిఐ విచారణ కోరుతూ హైకోర్ట్ లో రిట్ పిటిషన్ వేశారు. తన తండ్రి హత్యకు కారణాలేంటో, అసలు హంతకులు ఎవరో నిగ్గు తేల్చాలని కోరారు.

రాణి యార్లగడ్డ

Next Story