ఈ బాల మాస్టర్ కోడింగ్ పాఠాలు చెబుతాడు...!!

By Newsmeter.Network  Published on  11 Dec 2019 4:25 AM GMT
ఈ బాల మాస్టర్ కోడింగ్ పాఠాలు చెబుతాడు...!!

నల్ల రిమ్ కళ్లద్దాలు, ఎర్ర టీ షర్టు వేసుకుని ఆ మాస్టర్ గారు సిస్టమ్ ముందు కూర్చుని, ఆన్ లైన్ లో ఆ మాస్టర్ గారు విద్యార్థులకు కోడింగ్ లో పాఠాలు చెబుతున్నారు. మహాపాపులర్ మాస్టర్ అయన. ఆయన గారు చైనీస్ విడియో స్ట్రీమింగ్ సైట్ బిలిబిలిలో గత ఆగస్టు నుంచి పాఠాలు చెబుతున్నారు. ఆయనకు ఏకంగా అరవై వేల మంది పాలోయర్లు ఉన్నారు. దాదాపు పది లక్షలకు పైగా వ్యూస్ ఉన్నాయి.

ఇంతకీ ఆ మాస్టర్ గారి వయసెంతో తెలుసా... ? జస్ట్ ఎనిమిదంటే ఎనిమిదేళ్లు. అంటే ఈ మాస్టర్ గారు బుడ్డోడన్నమాట.

విటో అనే ఈ మాస్టర్ లాంటి బాల టీచర్లు చైనాలో నానాటికీ పెరుగుతున్నారు. చైనా ప్రభుత్వం అన్ని అంశాల్లోనూ టెక్నాలజీకి పెద్దపీట వేయడంతో తల్లిదండ్రులు పిల్లలకు కోడింగ్ నేర్పడం అవసరమని భావిస్తున్నారు. ఫలితంగా ఇలాంటి బుల్లి టీచర్లు పుట్టుకొస్తున్నారు. కోడింగ్ అంత సులభం కాదు. కానీ అంత కష్టం కూడా కాదని విటో అంటున్నాడు. విటో షాంఘైలో ఉంటాడు. తన చానెల్ లో విద్యార్థులకు ఓపిగ్గా కోడింగ్ పాఠాలు చెబుతాడు. యాపిల్ రూపొందించిన కోడింగ్ యాప్ స్విఫ్ట్ ప్లేగ్రౌండ్ గురించి తన కన్నా పెద్దవారికి వివరిస్తాడు. వారికి పాఠాలు చెబుతూ తానూ కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటున్నానని విటో చెబుతున్నాడు.

Vita

చైనా రోబోటిక్స్, కృత్రిమ మేథస్సు విషయంలో బారీగా పెట్టుబడులు పెడుతోంది. ప్రణాళికలను రచిస్తోంది. 2017 లో రూపొందించన కృత్రిమ మేథస్సు బోధనా ప్రణాళికలో భాగంగా స్కూళ్లలోనూ కోడింగ్ ను నేర్పించడం ప్రారంభించింది. గతేడాది చైనా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ విషయంలో తొలి పాఠ్యపుస్తకాన్ని కూడా బయటకు తెచ్చింది. ఝెజాంగ్ రాష్ట్రంలో ప్రోగ్రామింగ్ ను పాఠ్యాంశంగా స్కూళ్లలో చేర్చారు.

Vita

విటోకి ఆయన తండ్రి ఝావ్ జిహెంగ్ ఎంతో సాయం చేస్తున్నాడు. కొడుకు విడియోలను ఎడిట్ చేసి, అప్ లోడ్ చేస్తున్నాడు. సాంకేతిక సహకారాన్నిస్తున్నాడు. ఆయన దగ్గర్నుంచి కోడింగ్ ను నేర్చుకున్న విటో ఇప్పుడు సొంతంగా కోడింగ్ చేసే స్థాయికి ఎదిగి తండ్రినే అచ్చెరువొందిస్తున్నాడు.

Also Read

Next Story