తల్లీ బిడ్డలను విడదీసిన కరోనా.. తల్లి కోసం పరితపిస్తున్న కవలలు

By సుభాష్  Published on  19 March 2020 8:10 AM GMT
తల్లీ బిడ్డలను విడదీసిన కరోనా.. తల్లి కోసం పరితపిస్తున్న కవలలు

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా అతలాకుతలం చేస్తోంది. వైరస్‌ కారణంగా ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. వేలాదిగా మృత్యువాత పడుతున్నారు. పాజిటివ్‌ కేసులతో పాటు అనుమానితుల సంఖ్య పెరిగిపోతోంది. ఇక విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు.. విమాన సర్వీసులను రద్దు చేయడంతో మరిన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. కరోనా ఎఫెక్ట్ తో ఓ తల్లి తన బిడ్డలకు దూరమైంది. వీసా కోసం మలేషియా వెళ్లి అక్కడే చిక్కుకుపోయింది. అమ్మ కోసం ఆ చిన్నారులు ఎంతో ఎదురు చూస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

విశాఖ శివాజీపాలెంకు చెందిన సింధుషకు విజయ్‌ చంద్రతో వివాహం కాగా, భర్త మలేషియాలో ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వివాహం తర్వాత కుటుంబం మలేషియాలో ఉంటోంది. గత సంవత్సరం సింధూష డెలివరి కోసం విశాఖలో ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. ఏడు నెలల క్రితం ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. ఈలోపు ఆమె వీసా గడువు రావడంతో రెన్యూవల్‌ చేసుకోవాల్సి వచ్చింది. వీసా పనిమీద రెండు వారాల క్రితమే మలేషియాకు వెళ్లి రెన్యూవల్‌ చేయించుకుంది. సిందూష మలేషియా నుంచి శాఖకు వచ్చేందుకు ప్రయత్నించగా, కరోనా ఎఫెక్ట్‌ తో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఆమె నగరానికి రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. సింధూష మలేషియాలోనే చిక్కుకుపోయింది.

ఇద్దరు పిల్లలకు ఏడు నెలలు కావడంతో తల్లి కోసం పరితపిస్తున్నారు. సాయం కోసం ఇండియన్‌ ఎంబసీ వద్దకు వెళ్లినా ఫలితం లేకపోయింది. ఇండియన్‌ హైకమిషన్‌ కార్యాలయానికి వెళ్లి పరిస్థితి వివరించినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతోంది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన ఉన్నారు. ఇద్దరు పిల్లల కోసమైనా సింధూషను విశాఖకు రప్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Next Story