విద్యాసంస్థల సెలవులపై మంత్రి ఈటల కీలక వ్యాఖ్యలు

By సుభాష్  Published on  18 March 2020 2:40 PM GMT
విద్యాసంస్థల సెలవులపై మంత్రి ఈటల కీలక వ్యాఖ్యలు

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. దాదాపు 200 దేశాలకు వైరస్ పాకింది. తాజాగా తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఆరుకు చేరుకుంది. కరోనా ప్రభావంతో ముందస్తుగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఇక విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు సొంతూళ్లకు వెళ్తున్నారు. ఇంకొందరు పర్యాటక ప్రదేశాలకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చింది ప్రయాణాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లడానికి కాదని, కరోనా బారిన పడకుండా ఇంట్లోనే ఉండేందుకు సెలవులు ఇచ్చామని అన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం సెలవులు ఇచ్చిందని, పిల్లలకు వైరస్‌ సోకకుండా పూర్తి బాధ్యత తల్లిదండ్రులదేనని స్పష్టం చేశారు.

ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా సోకిన వ్యక్తుల్లో ఇద్దరు విదేశీయులున్నారు. మహింద్రాహిల్స్ కు చెందిన సాప్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ కోలుకోవడంతో అతన్ని డిశ్చార్జి చేశారు. విదేశాల నుంచి నగరానికి దాదాపు 20వేల ప్రయాణికులు వచ్చే అవకాశం ఉండటంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు స్క్రీనింగ్‌ చేసి అనుమానితులను నేరుగా వికారాబాద్‌, దూలపల్లిలోని క్వారంటైన్‌ సెంటర్లకు తరలిస్తున్నారు. కరోనాను కట్టడి చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది.

Next Story