శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. కళ్లలో మంట
By తోట వంశీ కుమార్ Published on 7 May 2020 8:49 AM ISTఉదయం నిద్ర లేచే సరికి ఏం జరిగిందో అర్థం కాలేదు. నాకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించింది. కళ్లు మండుతున్నాయి ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావడం లేదు, మా వాళ్లను లేపుదాం అనుకున్నా కానీ కళ్లు తిరిగి కిందపడిపోయా.. తరువాత లేచి చూస్తే ఆస్పత్రిలో ఉన్నా.. అంటూ ఓ బాధిత యువకుడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అక్కడ పరిస్థితి ఎంత హృదయ విదాకరంగా ఉందో అర్థం అవుతుంది.
విశాఖ నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్.ఆర్ వెంకటాపురంలోని ఎల్.జి పాలిమర్స్ పరిశ్రమ నుంచి తెల్లవారు జామున రసాయన వాయువు లీక్ కావడంతో ముగ్గురు మృతి చెందగా.. 200 మందికి పైగా అస్వస్థతకు గురైయ్యారు. ఈ వాయువు గాల్లోకి వ్యాపిస్తుండడంతో.. పరిసర గ్రామాల ప్రజలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు.
తెల్లవారు జామున 3 గంటల సమయంలో గ్యాస్ లీస్ అయిన సమయంలో అందరూ మంచి నిద్రలో ఉన్నారు. రసాయన వాయువు ప్రభావంతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. రసాయన వాయువు గాఢతకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడ్డారు. కళ్లు మండుతుండడంతో.. ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియక చాలా మంది తీవ్ర ఆందోళనకు గురైయ్యారు. ఈ క్రమంలో కొందరు అపస్మారక స్థితికి చేరుకుని రోడ్లపైనే పడిపోయారు. మరికొందరు ఇళ్ల నుంచి బయటకు రాలేక పోయారు. ఇంట్లో నుంచి బయటకు పరుగెత్తే క్రమంలో ఓ వ్యక్తి బావిలో పడి మృతి చెందాడు. అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువగా చిన్నారులు మహిళలు ఉన్నారు.ఈ రసాయనికి వాయువును పీల్చిన పశువులు నుగలు కక్కుతూ నెలకొరిగాయి.