విశాఖ: వాషింగ్ మెషీన్లలో రూ.1.3 కోట్ల హవాలా డబ్బు సీజ్

విశాఖ నగరంలో హవాలా డబ్బు తరలింపు ఘటన కలకలం రేపింది.

By Srikanth Gundamalla
Published on : 25 Oct 2023 10:23 AM IST

Vizag, police, money seized,  washing machine,

విశాఖ: వాషింగ్ మెషీన్లలో రూ.1.3 కోట్ల హవాలా డబ్బు సీజ్

విశాఖ నగరంలో హవాలా డబ్బు తరలింపు ఘటన కలకలం రేపింది. నగరంలోని ఎన్‌ఏడీ జంక్షన్ వద్ద బుధవారం తెల్లవారుజామున రూ.1.3 కోట్ల హవాలా డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా వాషింగ్ మెషీన్ల బాక్సుల్లో నగదు తరలిస్తుండగా పోలీసులు నగదుని పట్టుకున్నారు.

అయితే.. విశాఖపట్టణం నుంచి విజయవాడకు ఆటోలో వాషింగ్ మెషీన్లను తరలిస్తున్నారు. అనుమానం వచ్చిన పోలీసులు ఆ వాహనాన్ని ఆపి తనిఖీలు చేశారు. దాంతో.. వాషింగ్‌ మెషీన్ల డబ్బాల్లో దాచిన భారీగా డబ్బు బయటపడింది. దాదాపు రూ.1.3 కోట్ల నగదు బయటపడటంతో ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఒకేసారి పెద్దమొత్తంలో ఆటోలో డబ్బు తరలించడాన్ని చూసిన పోలీసులు కూడా షాక్‌ తిన్నారు. అయితే.. పట్టుబడ్డ నగదు మొత్తం హవాలాకు సంబంధించినదని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కాగా.. సదురు ఆటో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద ఆ నగదుకి సంబంధించి ఎలాంటి పత్రాలు లేవని.. అందుకే పట్టుకున్నామని పోలీసులు వెల్లడించారు. కాగా.. ఆటో డ్రైవర్‌ను విచారిస్తున్నట్లు వెల్లడించారు. ఎవరి ఆదేశాలతో నగదును తరలిస్తున్నాడనే దానిపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. 30 సెల్‌ఫోన్లు, ఆటో స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి సీఆర్పీసీ 41, 102 సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు.

కాగా.. గతంలో కూడా విశాఖలో హవాలా నగదును పోలీసులు సీజ్‌ చేశారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ వద్ద ఓ వ్యక్తి నుంచి రూ.70 లక్షలు సీజ్ చేశారు. అప్పుడు కూడా ఆ నగదుకి సంబంధించి ఎలాంటి పత్రాలు లేవని చెప్పారు. ఈ ఘటన 2021 జనవరిలో జరిగింది. అప్పుడు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నక్కపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. 2022 మే 18న రూ.3 కోట్లు తరలిస్తుండగా ఓ వ్యక్తిని పోలీసులు అడ్డుకున్నారు. తాజాగా కోటికి పైగా నగదు పట్టుబడటం స్థానికంగా సంచలనంగా మారింది.

Next Story