విశాఖలో కుంగిన కొత్త బస్‌ షెల్టర్‌

విశాఖ మహానగర పాలక సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఓ మోడ్రన్‌ బస్‌ షెల్టర్‌ కుంగింది.

By Srikanth Gundamalla
Published on : 27 Aug 2023 3:45 PM IST

Vizag, New Bus Shulter, Overturned, GVMC ,

 విశాఖలో కుంగిన కొత్త బస్‌ షల్టర్‌ 

విశాఖపట్నంలో ప్రమాదం తప్పింది. విశాఖ మహానగర పాలక సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఓ మోడ్రన్‌ బస్‌ షెల్టర్‌ కుంగింది. జీవీఎంసీ కార్యాలయం ముందే ఉన్న బస్ షెల్టర్‌ పక్కకు ఒరిగిపోయింది. అయితే.. కొత్తగా నిర్మించిన బస్సు షెల్టర్‌ ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోవడంతో స్థానికంగా కలకలం రేపుతోంది. కాగా.. ప్రమాదం సంభవించిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి నష్టం జరగలేదు.

జీవీఎంసీ అధికారులు నగరంలో నూతన బస్‌ షెల్టర్లను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. బస్సుల కోసం వేచిచూసే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకూడదని.. మోడ్రన్‌గా తీర్చిదిద్దారు. కానీ.. అదే బస్‌ షెల్టర్‌ ప్రమాదకరంగా మారింది. ఉన్నట్లుండి ఒకేసారి జీవీఎంసీ కార్యాలయం దగ్గర ఉన్న బస్సు షెల్టర్‌ పక్కకు ఒరిగింది. అయితే.. ఆ సమయంలో బస్సు షెల్టర్‌లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు. ఒక వేళ అదే సమయంలో బస్సు షెల్టర్‌లో ఎవరైనా ఉండి ఉంటే తలలు పగిలిపోయేవని.. ప్రాణ నష్టం జరిగే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అయితే.. ఈ బస్సు షెల్టర్‌ను ఐదు రోజుల క్రితమే నగర మేయర్‌ ఒలగాని హరి వెంకటకుమారి ప్రారంభించారు.

బస్‌ షెల్టర్‌ను రూ.40 లక్షల వ్యయంతో నిర్మించారు. అంత ఖర్చు చేసి నిర్మించిన బస్సు షెల్టర్‌ వారం రోజుల లోపే ప్రమాదానికి గురి కావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్సు షెల్టర్ల నిర్మాణంలో అవినీతి జరిగిందని సీపీఎం, జనసేన కార్పొరేటర్లు ఆరోపణలు చేస్తున్నారు. నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక నెటిజన్లు కూడా కుంగిన ఫొటోను షేర్‌ చేస్తూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.

Next Story