రైల్వే ట్రాక్‌పై ఆగిపోయిన కారు..అదే సమయంలో వచ్చిన గూడ్స్ రైలు..

మారుతీ జంక్షన్‌ వద్ద రైల్వే క్రాసింగ్‌ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్‌ దాటుతుండగా ఉన్నట్లుండి కారు ఆగిపోయింది.

By Srikanth Gundamalla  Published on  10 Aug 2023 2:48 PM IST
Vizag, Goods Train, Car, Four Injured,

 రైల్వే ట్రాక్‌పై ఆగిపోయిన కారు..అదే సమయంలో వచ్చిన గూడ్స్ రైలు..

విశాఖ: మారుతీ జంక్షన్‌ వద్ద రైల్వే క్రాసింగ్‌ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్‌ దాటుతుండగా ఉన్నట్లుండి కారు ఆగిపోయింది. అదే సమయంలో ఆ రూట్లో గూడ్స్‌ రైలు వచ్చింది. ట్రాక్‌పై ఉన్న కారును ఢీకొట్టింది. అయితే.. లోకో పైలట్‌ అప్రమత్తం కావడంతో కారులో ఉన్న నలుగురు ప్రయాణికులు చిన్నచిన్న గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.

గాజువాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మారుతీ జంక్షన్‌ వద్ద ఉన్న రైల్వే క్రాసింగ్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గూడ్స్‌ రైలు విశాఖ పోర్టు ట్రస్ట్‌ నుంచి మారుతీ జంక్షన్ మీదుగా శ్రావణ్ షిప్పింగ్‌ గోడౌన్ల వైపు వెళుతోంది. ఇక అదే సమయంలో ములసాగ హౌసింగ్ కాలనీ నుంచి నగరం వైపు ఓ కారు బయల్దేరింది. మారుతీ జంక్షన్ వద్ద ఉన్న రైల్వే క్రాసింగ్‌ వద్దకు రాగానే దురదృష్టవశాత్తు కారులో సమస్య వచ్చి ఆగిపోయింది. కారు ఎందుకు ఆగిపోయిందా అని అందులోని కూర్చొని చూస్తున్న సమయంలో అదే ట్రాక్‌పై గూడ్స్‌ రైలు వేగంగా దూసుకొచ్చింది.

కారు రైల్వే ట్రాక్‌పై ఆగి ఉండటాన్ని గూడ్స్‌ రైలు లోకో పైలట్ గమనించాడు. సమయస్ఫూర్తితో వెంటనే గూడ్స్‌ రైలు వేగం తగ్గించేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు. కానీ రైలు కారు దగ్గరగా రావడంతో.. పూర్తిగా నిలుపుదల చేయలేకపోయాడు. ఇక వెళ్లిపోవాలంటూ కారులో ఉన్నవారని హెచ్చరిస్తూ లోకో పైలట్‌ క్యాబిన్ బయటకు వచ్చి కూడా అరిచినట్లు స్థానికులు చెప్పారు. అయితే.. ఇదంతా గమనించని కారులో ఉన్న వారు అలాగే ఉండిపోయారు. దాంతో.. కారుని గూడ్స్‌ రైలు ఢీకొట్టింది. రైలు డ్యాష్ ఇవ్వడంతో కారు ఎగిరి రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులకు స్వల్పంగా గాయాలు అయ్యాయి.

లోకో పైలట్‌ కారుని గమనించి రైలు వేగాన్ని తగ్గించడంతో ప్రమాద తీవ్రత తగ్గిందని చెబుతున్నారు అధికారులు. లేదంటే కారులో ఉన్నవారు ప్రాణాలు కోల్పోయేవారి చెబుతున్నారు. కాగా.. కారులో రిటైర్డ్‌ నేవీ కుటుంబం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక ఈ ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి పరిస్థితిని పరీక్షించారు.

Next Story