వైజాగ్ బీచ్‌ రోడ్డులో కారు బీభత్సం.. ముగ్గురు దుర్మరణం

మద్యం మత్తులో విశాఖపట్నంలో యువకులు కారుతో బీభత్సం సృష్టించారు. అతివేగంతో కారు నడిపి మూడు ప్రాణాలను బలితీసుకున్నారు.

By Srikanth Gundamalla  Published on  8 Aug 2023 12:17 PM IST
Vizag, Beach Road, Car Accident, Three Dead ,

వైజాగ్ బీచ్‌ రోడ్డులో కారు బీభత్సం.. ముగ్గురు దుర్మరణం

మద్యం మత్తులో విశాఖపట్నంలో యువకులు కారుతో బీభత్సం సృష్టించారు. అతివేగంతో కారు నడిపి మూడు ప్రాణాలను బలితీసుకున్నారు. ఈ సంఘటనతో ఎలాంటి సంబంధం లేని దంపతులు ప్రాణాలు కోల్పోయారు.

వైజాగ్‌ బీచ్‌రోడ్డులోని రాడిసన్‌ బ్లూ హోటల్ దగ్గర సోమవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నగరానికి చెందిన ఐదుగురు యువకులు కారులో మద్యం సేవిస్తూ సాగరనగర్‌ నుంచి రుషికొండ వైపు బయల్దేరారు. కారు అతివేగంగా నడిపారు. రాడిసన్ బ్లూ హోటల్ సమీపానికి వచ్చే సమయానికి కారుని నియంత్రించలేకపోయారు యువకులు. దాంతో.. కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత అవతలి రోడ్డులోకి దూసుకెళ్లింది. అదే సమయంలో రుషికొండ నుంచి నగరంలోకి వెళ్తున్న దంపతుల బైక్‌ను ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా అదే వేగంతో చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులు ఇద్దరూ తీవ్రగాయాలు అయ్యి..అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఇక కారు వెనుకసీటులో కూర్చున్న మరో యువకుడు కూడా మృతిచెందాడు. ఎయిర్‌బెలూన్స్‌ ఓపెన్ కావడంతో కారు నడుపుతున్న వ్యక్తితో పాటు కారు ముందు సీట్లో కూర్చున్న వ్యక్తి క్షేమంగా బయటపడ్డారు. మరో యువకుడికి తీవ్రగాయాలు అయ్యాయి. దాంతో.. అతడిని ఆస్పత్రికి తరలించారు. కారులో బీరుబాటిళ్లను గుర్తించామని.. మద్యం సేవించి కారు నడిపినట్లు తెలుస్తోందని పోలీసులు భావిస్తున్నారు. నిర్లక్ష్యంగా కారు డ్రైవ్‌ చేయడం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కారులో ప్రాణాలు కోల్పోయిన యువకుడు పీఎం పాలెంకు చెందిన మణికుమార్‌గా పోలీసులు గుర్తించారు. బైక్‌ పై వస్తూ ప్రాణాలు కోల్పోయిన దంపతులు రాయగడ ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. కారులో ప్రయాణం చేసిన వారిలో ఒక యువకుడు పరారీలో ఉన్నాడని.. అతడికోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

ఇక ప్రమాద సమయంలో కారుని 150 కిలోమీటర్ల వేగంతో నడిపి ఉండొచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. కారు అతివేగంగా వచ్చి గుద్దడంతో చెట్టు వేర్లతో సహా లేచిపోయి రోడ్డుపక్కకు పడిపోయింది. కాగా..మృతదేహాలను కేజీహెచ్‌ మార్చురీకి తరలించినట్లు విశాఖపట్నం పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Next Story